సమాజంలో బ్రతుకుతున్నామా! స్మశానంలో బ్రతకుతున్నామా? అవును ఇప్పుడు ఈ ప్రశ్న అందరూ తప్పక వేసుకోవాల్సిందే. ఎందుకంటే మానవత్వం అనేది మంటగలిసిపోయిన వేళ. కరోనా లేదని..కరోనా కాదని మొత్తుకున్నా సామాన్య జనం దగ్గర నుంచి ఆసుపత్రుల వరకూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఆ సుపత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరు? ఆసుపత్రులా? సామాన్య జనమా? మీడియానా? ప‌్రభుత్వమా? అంటే అందరూ భాగస్వాములే. ఇందులో ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి లేదు. కరోనా పేరు చెప్పి అంటరాని వాడిలా సమాజం చూస్తోంది. అదే కరోనాని భయపెట్టి మీడియా ఎన్ క్యాష్ చేసుకుంటుంది.
మంచితో పాటు, చెడుని అంతే వేగంగా స్ర్పెడ్ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్లు ఉండవు..సరైన వైద్యం అందదు. మందులుండవు. రోగి పరిస్థితి ఎంత సీరియస్ గా ఉన్నా లైట్ తీసుకునే కరుడగట్టిన హృదయాలు ఆసుపత్రుల్లో ఎన్నెన్నో. అలాంటి నిర్లక్ష్యానికే ఓ అభాగ్యుడు బలయ్యాడు. సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందిన ఓ విషాధ గాథ ఇది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందిన బాబురావు(40) ఓ టీవీ మెకానిక్. వారం రోజుల క్రితం శ్వాస సమస్యతో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయాన్నే సంగారెడ్డిలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ అక్కడ సిబ్బంది ఆ సుపత్రిలో చేర్చుకోలేమని చెప్పింది. దీంతో ఆ ఆసుపత్రి సిబ్బంది కాళ్ల మీద పడి ప్రాథేయపడింది. ఆ సమయంలో చుట్టు పక్కల వారిని పిలిచి అయ్యా! మీరైనా చెప్పండని గుండెలు పగిలేలా రోధించింది. అయినా ఏ ఒక్కరూ కనికరించలేదు. ఆసుపత్రి సిబ్బంది గానీ…అక్కడ జనం గానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు గంట సేపు ఆ భార్య అక్కడే వేచి చూసింది. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. సంగారెడ్డి కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టింది. కానీ మార్గ మధ్యలోనే ఆ భర్త కన్నుమూసాడు. ఆపై మరో సమస్య బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రెట్టింపు ఛార్జీలు అడిగాడు. ఇదీ ఓ సామాన్యుడికి అనారోగ్యం వస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. ఇదొక్కటే కాదు. దేశ వ్యాప్తంగాను…తెలుగు రాష్ర్టాల్లోనూ ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. మరి వీటన్నింటికి కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి బధిలిస్తాయో!
–శ్రీకాంత్ కొంతం