వరుస ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కవిత విజయం సాధించారు. ఆ ఎన్నికలంటే ప్రజాప్రతినిధులంతా తమవారే కాబట్టి ఈజీగా నెగ్గగలిగారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అలా కాదు. ప్రజాక్షేత్రంలో నిలిచి గెలవాల్సిన ఎన్నికలు. అందుకే కేసీఆర్ కంగారుపడుతున్నారట. ఇప్పటికే దుబ్బాకలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుండగా తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో సైతం గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వెలువడుతోంది. బీజేపీ గతం కంటే పుంజుకున్నటు కనిపిస్తోంది. కాబట్టి తెరాస సీట్లకు గండిపడే అవకాశం లేకపోలేదు.
ఇక ప్రకృతి సైతం తెరాస మీద పగబట్టినట్టే కనబడుతోంది. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా విశ్వనగరం కాస్త జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ దాదాలు జలదిగ్భంధం అయ్యాయి. ఏ అర్థారాత్రో భీకరమైన వర్షం పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని చెరువులన్నీ ఆక్రమణకు గురికావడంతో పాత డ్రైనేజి వ్యవస్థ వర్షపు నీటి ఉధృతిని తట్టుకోలేకపోతోంది. ఫలితంగా ఎక్కడి నీరు అక్కడే నిలిచి పోతోంది. ఎత్తైన ప్రాంతాల్లో నీరు కూడ లోతట్టు నివాస ప్రాంతాల్లోకి చేరుతుండటంతో ఇళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఇక ఒక మోస్తరు వర్షం కురిస్తే వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కార్లు, బైకులు పూర్తిగా నీటిలో మునిగిపోయే సిట్యుయేషన్.
ప్రస్తుతం భాగ్యనగరంలో ఎవ్వరిని కదిలించినా ఒకటే మాట.. ఈ నీళ్లేమిటి, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇంకెన్నాళ్లు మాకీ కష్టాలు అనే మాటలే. కేసీఆర్ అధికారంలోకి రావడం ఇది రెండవసారి. గత గ్రేటర్ ఎన్నికల్లో సైతం భారీ విజయాన్ని అందించారు ప్రజలు. అయినా నగరంలో ఇప్పటికీ పాత పరిస్థితులు, పాత కష్టాలే ఉన్నాయి. డ్రైనేజి వ్యవస్థలో పెద్దగా అభివృద్ధి లేదని అంటున్నారు. ఇక ప్రత్యర్థి వర్గాలైతే ఈ వానలకు అడ్వాంటేజ్ తీసుకుని కేసీఆర్ పాలన మీద విరుచుకుపడుతున్నారు. దీనికితోడు కరోనాను ఎదుర్కోవడంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనితీరు లేదనే అభిప్రాయం కూడ కొందరు ప్రజల్లో ఉంది. ఈ ప్రతికూలతలన్నీ గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కారుకు బ్రేకులు వేస్తాయనే విశ్లేషణలు జరుగుతున్నాయి.