వేసవిలో ‘మామిడి’ హాయ్.. హాయ్..! అపోహలు వదిలి ఎంజాయ్..!!

వేసవి కాలం వస్తుందంటే అమ్మో ఎండలు.. మండుతాయి అనుకునేలోపే నేనున్నానంటూ ‘మామిడి’ గుర్తు చేసి చల్లబరుస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ లో మామిడిని కొట్టేది లేదు. కొబ్బరి మామిడి, రసాలు, చిన్న రసాలు, బంగినిపల్లి, సువర్ణ రేఖ, నూజివీడు రసాలు, కలెక్టర్, తోతాపూరి.. ఇలా మామిడిలో రకాలు ఊరిస్తాయి. అద్భుతమైన రుచితోపాటు పోషకాలు ఎక్కువగా ఉండే మామిడిలో మరెన్ని గుణాలు ఉన్నాయంటున్నారు న్యూట్రీషియన్లు. ఊబకాయం, బరువు పెరగడం వంటి మాటలు నమ్మొద్దంటున్నారు. మామిడికాయల్ని స్లైస్, రసం, ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒరిజినల్ మామిడి రసానికి మించింది లేదంటున్నారు.

మామిడిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, కాపర్, ఫోలేట్ ఉంటాయి. కొవ్వు ఒక్కశాతం ఉంటుంది. మామిడిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. పీచు పదార్ధం కాబట్టి గుండె సంబంధ సమస్యలను తగ్గిస్తుందట. జీర్ణక్రియ కూడా బాగుంటుందట. రోజుకో మామిమి తింటే రక్తహీనత తగ్గుతుంది. పంటి సమస్యలు తొలగుతాయి. నోటిలో బ్యాక్టీరియా పోతుంది. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. చర్మం నిగారిస్తుంది. మొత్తంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మామిడి నిద్ర లేమి సమస్యను తీరుస్తుందని కూడా అంటున్నారు. మామిడి వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుందట. మామిడి తింటే వేడి చేస్తుందని, డయాబెటిస్ ఉన్నవారు తినకూడదనేది కూడా అపోహే అంటున్నారు. టైప్-2 డయాబెటీస్ ను తగ్గించడంతో మామిడి సమర్థవంతంగా పని చేస్తుందట. పీచు పదార్ధం ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందంటున్నారు. మంచి చేసే మామిడిపై అపోహలు మాని సీజనల్ ఫ్రూట్ ని ఎంజాయ్ చేయడమే బెటర్ అంటున్నారు న్యూట్రీషియన్లు.

అయితే.. నేటి రోజుల్లో మామిడిని కాల్షియం కార్బైడ్ ఉపయోగించి మగ్గించేస్తున్నారు. వీటివల్ల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, కండరాల సమస్యలు వస్తాయి. మామిడి నున్నగా పసుపు రంగులో ఉంటే అనుమానించాల్సిందే. సహజసిద్ధంగా వరి గడ్డిలో మగ్గించే పండ్లు మచ్చలు కలిగి ఉంటాయి. అవే శ్రేయస్కరం అని నిపుణులు అంటున్నారు. చెట్ల నుంచి నేరుగా తెంపిన పండ్లైతే మరీ మంచిది.

 

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.