డర్టీ రాజకీయం: ఏపీలో ఫేక్ పిటిషనర్లు కూడానా.?

ఫేక్ పొలిటీషియన్లు.. ఫేక్ ఓటర్లు.. కొత్తగా ఫేక్ పిటిషనర్లు కూడా పుట్టుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ చూడని వింత ఇది. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆ స్థలాల్లో ఇళ్ళు కట్టించి ఇచ్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే.
జగనన్న ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కాదు.. జగనన్న ఊళ్ళు.. అంటూ ప్రచారం జరుగుతోంది ఈ కార్యక్రమానికి.

అయితే, సెంటు స్థలంలో ఇళ్ళు కట్టడమేంటి.? సెంటున్నర స్థలంలో ఇళ్ళ నిర్మాణంతో ఉపయోగమేంటి.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. అంతేనా, ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలయ్యాయి.. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, నెల రోజుల లోపు ఆయా అంశాలపై లోతుగా పరిశీలన జరిపి, నివేదిక అందించాలని ఆదేశించింది.

ఇక, ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం షురూ అయ్యింది. టీడీపీ తెరవెనుకాల కథ నడిపిస్తోందనీ, వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తూ, దాదాపు 30 లక్షల మంది పేదలకు గూడు దక్కకుండా చేస్తోందనీ వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ‘ఫేక్ పిటిషనర్ల’ బాగోతాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది.

ఇలాక్కూడా జరుగుతుందా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు ఫేక్ పిటిషనర్ల వ్యవహారంపై ‘మేం ఎలాంటి పిటిషన్లూ దాఖలు చేయలేదు.. మా ఆధార్ కార్డు సహా పలు వివరాలు కొందరు వ్యక్తులకు ఇచ్చాం..’ అని బాధితులు చెబుతున్నారు.

నిజానికి, ఇది చాలా తీవ్రమైన అంశం. కోర్టు వరకూ వెళ్ళిన అంశంలో పిటిషనర్లు ఫేక్ అంటే ఎలా.? అది సాధ్యమయ్యే పనేనా.? పిటిషనర్లను ఎవరైనా బెదిరిస్తున్నారా.? లేదంటే, బెదిరించి వారి దగ్గరనుంచి వివరాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్లు దాఖలయ్యాయా.? ఇలా చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి.

న్యాయ వ్యవస్థకే ఇదొక సవాల్ లాంటి అంశం అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో, సమస్యలో తీవ్రత బయటపడినప్పుడు, పిటిషనర్లు ఎవరైతే ఏంటి.? అన్నవాదనా లేకపోలేదు.