సొంత పార్టీలోనే దెబ్బ‌లాట‌లు..ఇదెక్క‌డికి దారితీస్తుందో?

వైకాపా పార్టీలో అదీ రాయ‌ల‌సీమ పాత్రంలో ఆధిప‌త్య‌‌పోరు రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటుంది. మొన్న అనంత‌పురం జిల్లాలో రేష‌న్ స‌రుకుల పంప‌ణీ విష‌యంలో సొంత పార్టీ నేత‌లే ఆధిప‌త్యం కోసం త‌గాదాకు దిగారు. ఎంపీటీసీ నామినేష‌న్లు వేదిక‌గా చేసుకుని ఒకరిపై ఒక‌రు క‌ల‌బ‌డ్డారు. ఇప్ప‌టికీ ఆ వార్ నేత‌ల మ‌ధ్య కొనసాగుతుంది. అటు క‌ర్నూలు జిల్లాలోనూ ఇలాంటి పంచాయతీ ఒక‌టి రోడ్డెక్కింది. అటుపై చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి- నగరి ఎమ్మెల్యే రోజా మ‌ధ్య‌ మాటల యుద్దం మిన్నంటింది. ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా? నేనా? అన్నంత‌గా సీన్ క్రియేట్ అయింది. చివ‌రికి పెద్ద‌లు క‌ల్పించుకుని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసారు.

తాజాగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాల్లోనే మ‌రో పంచాయ‌తీ. బ‌ద్వేలు నియోజ‌క వ‌ర్గంలో అక్క‌డ వైకాపా ద్వితీయ శ్రేణి నాయ‌కులు న‌డిరోడ్డుపై కొట్టుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య చూస్తుండ‌గానే ఇరు వ‌ర్గాలు బ‌లం చూపించుకునే ప్ర‌యత్నం చేసాయి. ఎమ్మెల్యే ఎంత కంట్రోల్ చేసినా ఎవ‌రు కంట్రోల్ అవ్వ‌లేదు. ఎవ‌రిష్టానుసారం మాట‌లు విసురుకోవ‌డం…చేతులు చేసుకోవ‌డం జ‌రిగింది. అయితే ఈ వివాదానికి కార‌ణం ఆ ఎమ్మెల్యే అనే తెలుస్తోంది. క‌డ‌ప జిల్లా కోడూరు మండ‌లంలోని పాయ‌ల‌కుంట‌లో గ్రామ స‌చివాల‌యానికి శంకుస్థాప‌న చేసేందుకు బ‌ద్వేలు ఎమ్మెల్యే సుబ్బ‌య్య గ్రామానికి చేరుకున్నారు.

అయితే సొంత పార్టీ వ‌ర్గాన్నే త‌మ పార్టీ నేత‌లు ఉద్దేశ పూర్వ‌కంగా పిల‌వ‌లేద‌ని గొడ‌వ మొద‌లైంది. దీంతో ఆ వ‌ర్గం..ఈ వ‌ర్గం మ‌ధ్య ఆధిప‌త్యం పోరు మొద‌లై కొట్టుకునే వర‌కూ దారి తీసింది. చివ‌రికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఇరు వ‌ర్గాల్ని చెద‌ర‌గొట్టారు. అయితే త‌రుచూ ఇలాంటి ఆధిప‌త్య‌ పోరు సీమ‌లో చోటు చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారుతోంది. ఇది జ‌గ‌న్ స‌ర్కార్ కి ఇబ్బందిగా..ప్ర‌తిపక్షానికి ఆయుధంగా మారుతుంది. సొంత పార్టీ నేత‌లే కుమ్ములాట‌కు దిగ‌డం తో ఆ నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యేల‌కు త‌ల‌బొబ్బి క‌ట్టిస్తోంది. స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా పంచాయితీ ఏర్పాటు చేసినా ఏ ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌న్న వాద‌న విపిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఉన్న ప‌రిస్థితుల్లో ఇలా సొంత పార్టీ నేత‌లు కొట్టుకోవ‌డం అనేది అధికార ప‌క్షానికి భంగ‌పాటు అన‌క త‌ప్పేలా లేదు.