దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేస్తుందంటూ నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. నిజానికి, ఎప్పుడో చెయ్యాల్సిన పని ఇది. రాష్ట్రాలపై భారం తగ్గించేలా మోడీ సర్కార్ ప్రకటన వుందన్నది నిర్వివాదాంశం. ఆర్థిక భారం ఓ యెత్తు.. వ్యాక్సిన్లను సమకూర్చుకోవడానికి పడే పాట్లు ఇంకో యెత్తు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, వ్యాక్సిన్ల విషయమై కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుంది. కానీ, ఆ వ్యాక్సిన్ వినియోగంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. అంటే, ఎవరికి ముందు ప్రాధాన్యతనివ్వాలన్నది అన్నమాట. తొలి ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత.. అంటూ లెక్కలుగట్టి, 18-45 ఏళ్ళ వయసువారికి షరామామూలుగానే చివరి ప్రాధాన్యతలోకి నెట్టేసింది కేంద్రం. అంటే, 18-45 ఏళ్ళ వయసువారికి వ్యాక్సిన్ అందడం అంత వీజీ కాదన్నమాట.
వ్యాక్సినేషన్ వేస్టేజ్ ఎక్కువ వుంటే ఆ ప్రభావం, ఆయా రాష్ట్రాలపై కేంద్రం సరఫరా చేసే టీకాల సంఖ్య మీద వుంటుందట. ఇదొక్కటేనా, ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఆధారంగా వ్యాకిసన్లను రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తుందట.
ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా తగ్గించగలిగిన రాష్ట్రాలకు వ్యాక్సిన్ కోటా తక్కువ అందుతుందేమో.. అదే జరిగితే, సమర్థవంతమైన నాయకత్వం.. ఆ రాష్ట్ర ప్రజలకు శిక్ష కాబోతోందన్నమాట. ఇక, వ్యాక్సిన్ ఉచితం.. అంటూనే, 25 శాతం టీకాలు ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాలని కేంద్రం చెబుతుండడం అనుమానాలకు తావిస్తున్న విషయం విదితమే. ఆ 25 శాతం టీకాల్ని కూడా రాష్ట్రాలకు కేంద్రమే అందించొచ్చు కదా.? ఇన్ని నిబంధనలు పెట్టడం ద్వారా కేంద్రం, ఏం సంకేతాలు పంపుతున్నట్టు.?