ట్రంప్ టారిఫ్‌లకు ధీటుగా BRICS మాస్టర్ ప్లాన్.. పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చలు..!

ప్రపంచ రాజకీయం వేగంగా మారుతున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురి నేతలు తాజా పరిణామాల గురించి చర్చించికున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్ అనంతరం మోదీ చేసిన ట్వీట్‌లో, ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష చేసినట్టు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న అభిప్రాయంపై ఒకే మాటపై నిలిచినట్టు తెలిపారు.

ఈ సంభాషణ కేవలం ఉక్రెయిన్ సంగతులకే కాదు, అంతర్జాతీయ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఒక రోజు ముందు బ్రెజిల్ అధ్యక్షుడు లులాతోనూ మోదీ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి రంగాల్లో సహకారం పెంచాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ రెండు ఫోన్ సంభాషణల సమయము ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి.

ఇది BRICS దేశాల వ్యూహాత్మక ఐక్యతగా మారుతుందా అన్న చర్చ మొదలైంది. చైనా, బ్రెజిల్, రష్యా ఇప్పటికే భారత్‌తో గట్టి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం, అమెరికా ఏకపక్ష విధానానికి BRICS దేశాలు ఓ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతున్నాయా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా, భారత్-రష్యా సంబంధాలు చరిత్ర పుటల్లో స్థిరమైన మైత్రీగా నిలిచాయి. 1971లో యుద్ధ సమయంలో అమెరికా భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధనౌక పంపిన వేళ, రష్యా భారత్‌కు నిలువెత్తు మద్దతుగా నిలిచింది. అదే స్థిరబంధం తరువాతి దశల్లో మరింత బలపడింది.

2000లో పుతిన్ భారత్‌కి వచ్చినప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యానికి తొలి అడుగు పడింది. అప్పటి నుండి రక్షణ, విజ్ఞానం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వేగంగా ఎదిగాయి. ఇప్పటికే వార్షిక శిఖరాగ్ర సమావేశాలుగా 21 సార్లు అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగాయి. 22వ సమావేశానికి మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా లక్ష్యాల దాటి దూసుకెళ్తోంది. $30 బిలియన్ టార్గెట్‌ను చేరిన ఈ ద్వైపాక్షిక సంబంధం, ప్రస్తుతం $50 బిలియన్ పెట్టుబడి లక్ష్యంగా కొనసాగుతోంది. ప్రపంచం గందరగోళంగా ఉన్న వేళ, భారత్-రష్యా స్నేహం మరింత శక్తివంతంగా మారుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం సమయం చెబుతుంది.