దేశ జనాభాలో 2 కోట్ల మందికి మాత్రమే ఇప్పటిదాకా కరోనా సోకిందని కేంద్రం లెక్కలు చెబుతోంది. నిజానికి, ఇది కొంతమేర మంచి విషయమే. కానీ, కరోనా చాలామందిలో ఎలాంటి లక్షణాల్లేకుండానే వచ్చి వెళ్ళిపోతోన్న దరిమిలా, అసలు ఎంతమందికి కరోనా సోకిందో ఎలా తెలుస్తుంది.? అన్నది ఇంకో ప్రశ్న. ఆ విషయాలు పక్కన పెడితే, గత కొద్ది రోజులుగా దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. కొన్ని రోజులపాటు 60 వేల పైన రోజువారీ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పైగానే పడిపోతుండడం గమనార్హం. తెలంగాణలోనూ కరోనా నెమ్మదిస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ గ్రాఫ్ క్రమేణా కిందికి దిగి వస్తోంది. అయితే, అత్యంత బాధాకరమైన విషయమేంటంటే, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతోగానీ, ఇదివరకటిలా కాకుండా కరోనా సోకిన కొద్ది రోజుల్లోనే కొందరిలో మరణం సంభవిస్తోందంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వార్తా కథనాలు వస్తున్నాయి.
బాధిత కుటుంబాలు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ భారతం పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. నగరాలు, పట్టణాలకు సంబంధించి లెక్కలు కాస్త పక్కగానే వుండే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో అలా కాదు. సో, అనధికారిక మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సంభవించొచ్చు. ఇది నిజంగానే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. అయితే, లెక్కలు పక్కగానే వుంటున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురవ్వాల్సిన పనిలేదనీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా పట్ల అవగాహన, చైతన్యం.. ఒకే స్థాయిలో వున్నాయన్నది ప్రభుత్వాల వాదన.