కరోనా మొదటి వేవ్ ఓ స్థాయిలో భయపెడితే, రెండో వేవ్ ఇంకో స్థాయిలో భయపెట్టింది. మరి, మూడో వేవ్ ఎలా వుండబోతోంది.? ఏమోగానీ, మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు మమ్మరం చేశాయి.
ఆక్సిజన్ అవసరం ఎంతమేరకు వుంటుంది.? ఏయే మందులు అవసరమవుతాయి.? ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పించాలి.? అసలంటూ మూడో వేవ్ రాకుండా.. లేదంటే, తీవ్రత తగ్గించే చర్యలు ఏం తీసుకోగలం.? అన్న దిశగా ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి.
ఇంకోపక్క, మూడో వేవ్ వస్తే.. ఎలా లాభపడాలి.? అన్న దిశగా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, మెడికల్ అండ్ హెల్త్ మాఫియా కూడా సన్నద్ధమవుతోంది. రెండో వేవ్ నేపథ్యంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత చూశాం. దాంతోపాటుగా, బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం వినియోగించే మందుల కొరతనీ మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంది. మెడికల్ ఆక్సిజన్ పేరుతో జరిగిన దోపిడీ సంగతి సరే సరి. ఇవన్నీ ఓ యెత్తు.. సాధారణ మందులతోనూ కోట్లు కొల్లగొట్టేయడం ఇంకో యెత్తు.
ఔను, పారాసిటమాల్ వంటి సాధారణ మందుల్ని సైతం అడ్డగోలుగా అమ్మేసి క్యాష్ చేసుకున్నారు కేటుగాళ్ళు రెండో వేవ్ నేపథ్యంలో. విటమిన్ ట్యాబ్లెట్ల విషయానికొస్తే, వందల కోట్ల, వేల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరిగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రలు ఆన్‌లైన్ చికిత్స పేరుతో అవసరమైనవారికీ, అవసరం లేనివారికీ విటమిన్ ట్యాబ్లెట్లు సహా, పలు రకాలైన మందుల్ని ప్యాకేజీ రూపంలో అందించాయి.
ఈ క్రమంలో వేల కోట్లు దండుకున్నాయి మొత్తంగా అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు కలిసి. చిన్న చిన్న క్లినిక్స్ సైతం.. లక్షల్లో, కోట్లలో సంపాదించేశాయి కరోనా సెకెండ్ వేవ్ పుణ్యమా అని. ఇదిలా వుంటే, ఫేక్ వ్యాక్సిన్లు ఇప్పటికీ దేశంలో అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. వీటి మాటున జరుగుతున్న దందా విలువ కూడా కోట్లలోనే వుంటుందనేది ఓ అంచనా.