తిరుపతి ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ నాయకుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ, సంక్రాంతి ముహూర్తాన్ని ప్రకటించేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి.? అందులో సదరు కాంగ్రెస్ నాయకుడి పరపతి ఏంటి.? కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయితే.. ఆ ముఖ్యమంత్రిని ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్చేసుకోవచ్చు. ఇంతకీ, అలా జోస్యం చెప్పిన ఆ కాంగ్రెస్ నాయకుడెవరంటే, ఆయనెవరో కాదు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రత్యామ్నాయం అవసరం అని చింతా మోహన్ సెలవిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఇక సెలవ్.. అని తెలుగు రాష్ట్రాల్లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ప్రజలు తేల్చి చెప్పేసిన’ వైనం గురించి చింతా మోహన్ ఇంకా తెలుసుకోలేకపోవడం శోచనీయం. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదంటేనే, ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో మనుగడ సాధించడానికి వీల్లేదని జనం డిసైడ్ చేసేసినట్టే కదా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే, రాజకీయంగా తమ ఉనికి నిలబడుతుందని భావించే చాలామందిలో చింతా మోహన్ కూడా ఒకరని అనుకోవాలేమో.
అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఓ వంద మంది కార్యకర్తల్ని వెంటేసుకు తిరగగల నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో వున్నారా.? చింతా మోహన్ వెనుక ఆ వంద మంది కార్యకర్తల్ని చూసే పరిస్థితి వుందా.? లేదు. అలాంటి వ్యక్తి, సంక్రాంతికి ముఖ్యమంత్రి మారతారంటూ ‘పిట్టలదొర’ కబుర్లు చెబుతున్నారు. కనీసం కామెడీ అని కూడా జనం నవ్వుకోలేకపోతున్నారు.. చింతా మోహన్ మీద జాలి పడే పరిస్థితి కూడా లేదు తిరుపతిలో.