వివాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తమ సొంత వ్యవహారంలా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పేశాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘ప్రైవేటీకరణ వద్దు..’ అని లేఖ రాస్తే మాత్రం ఏం ప్రయోజనం.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనకు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చాక, విభజన పద్ధతిగా చేయాలంటూ టీడీపీ ఎన్ని లేఖలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆనాటి ఆ పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూడొచ్చు. ఆ పక్రియే కాస్త నయ్యం.. ఇప్పటి ఈ పరిస్థితితో పోల్చితే. రాష్ట్రానికి అసలు సంబంధమే లేదని కేంద్రం చెప్పేసింది. దాంతో, రాష్ట్రం ఎన్ని సూచనలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా ఉపయోగం వుండదు. మరి, ఉపయోగం వుండదని తెలిసీ, ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ ఎందుకు రాసినట్లు.? మొదటి లేఖకు సరైన రెస్పాన్స్ రాకపోయినా, రెండో లేఖ జగన్ రాయడం వెనుక ఆంతర్యమేంటి.? ముఖ్యమంత్రిగా జగన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ లేఖల ఎపిసోడ్‌ని నడిపిస్తున్నారు.
కేంద్రం, తన పని తాను చేసుకుపోతోంది. తాజా లేఖలో ‘అఖిలపక్షం’ అనే అంశం చుట్టూ రాష్ట్రంలో రాజకీయ రచ్చ మొదలైంది. అఖిలపక్షానికి అన్ని రాజకీయ పార్టీలూ మద్దతిస్తాయా.? అన్నది ఇప్పటికైతే సస్పెన్సే. రాజీనామాల ప్రసహనం ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రూపంలో మొదలైన దరిమిలా, విపక్షాలు ఖచ్చితంగా రాజీనామాల డిమాండ్లను అధికార పార్టీ ముందుంచుతాయి. అధికార పార్టీ ఎలాగూ రాజీనామాలకు సుముఖంగా లేదనే విషయం మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైపోయింది. అయితే, ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకునేందుకు అవకాశముంది. రాజీనామాలు చేయించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు రాజకీయంగానూ పై చేయి సాధించేందుకు వీలుపడుతుంది. ఇంత పెద్ద స్కెచ్ నిజమే అయితే అది వర్కవుటవ్వొచ్చు రాజకీయంగా.. కానీ, విశాఖకు ఎంత మేలు.? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.