ఐపీఎల్ 2025 మళ్లీ రీ-ఎంట్రీకి సిద్ధమైంది. మే 17 నుంచి టోర్నీ మళ్లీ మొదలవుతుందని బీసీసీఐ ప్రకటించడంతో క్రికెట్ పండుగకు మళ్లీ వేడి చేకూరింది. కానీ ఈసారి వేదికల ఎంపిక తెలుగు రాష్ట్రాల అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐపీఎల్ వేడుకకు ఊహించని షాక్ ఇచ్చింది బోర్డు.
దేశవ్యాప్తంగా మిగిలిన మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ఏకంగా ఆరు వేదికలు ఖరారు చేసింది. ముంబయి, జైపూర్, లక్నో, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్. కానీ ఉప్పల్ స్టేడియం, విశాఖ స్టేడియాలకు పూర్తిగా నో చెప్పింది. గతంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఈ ప్రాంతాలకు ఇచ్చే బీసీసీఐ, ఈసారి మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులకు తీరని దెబ్బ.
ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయనప్పటికీ, లీగ్ స్టేజీ నుంచి స్థానిక స్టేడియాలను వదిలేయడం వల్ల నిరాశ తీవ్రంగా వ్యక్తమవుతోంది. విశేషం ఏమిటంటే… హైదరాబాద్ ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన వేదిక. చాలా కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ఈ మైదానం ఈసారి జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐపీఎల్‌కు భారీగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాదిరిగానే, విశాఖలో జరిగిన మ్యాచ్‌లకు కూడా విశేష స్పందన లభించింది. అయినా ఈసారి ఇరు రాష్ట్రాల మైదానాలకు ఆహ్వానం అందకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. పునఃప్రారంభం వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నా… తెలంగాణ, ఏపీ క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది అర్ధాంతర ఆనందంగా మారింది.