బూతులు, దాడులపై సీఎం జగన్ స్పందించారుగానీ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెత్త, వింత పోకడలు కనిపిస్తున్నాయి. బూతులే రాజకీయ భవిష్యత్.. అనుకుంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. దాడులే రాజకీయ ఎదుగుదలకు రాచ మార్గాలనుకుంటున్నారు మరికొందరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నేతల దిగజారుడు వ్యాఖ్యలు, టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలు.. వెరసి, రాష్ట్రం రావణ కాష్టంగా తయారవుతోంది.

అడపా దడపా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ తిట్ల ప్రసహనంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలని రాజకీయ పార్టీలు, నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నట్లు.? ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పలుమార్లు మాట తూలారు. ఇప్పుడు టీడీపీ నోరు జారుతోంది.. అంతే తేడా.

దానికి కొనసాగింపుగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయ్.. అదే అతి పెద్ద తేడా. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించారు. తనను టీడీపీ నేతలు దారుణంగా తిడుతున్న దరిమిలా, కొందరు అభిమానులు బీపీ తెచ్చుకుని, రియాక్షన్స్ చూపిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

‘అందరూ సంయమనం పాటించండి.. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.. శాంతియుత మార్గంలో నిరసన తెలపాలి..’ అని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిస్తే బావుండేది. బీపీ అనేది వైసీపీ కార్యకర్తలకే కాదు, టీడీపీ అలాగే జనసేన.. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల కార్యకర్తలకూ పెరిగిపోవచ్చు.. వాళ్ళ నుంచీ రియాక్షన్స్ రావొచ్చు.

టీడీపీ ఈ మధ్య కొంత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్న మాట వాస్తవం. దాన్ని ప్రజాస్వామ్యయుతంగానే ప్రభుత్వం అణచివేయాల్సి వుంటుంది. కానీ, ఈ దాడులేంటి.? దేశం ఏమనుకుంటోంది రాష్ట్రం గురించి.! ఇది కదా అధికారంలో వున్నవాళ్ళు ఆలోచించాల్సింది.?