మోదీతో స్నేహం కోసం టీడీపీ వైసీపీ ఆరాటం.. ప్రజలకు నవ్వొస్తోందిగా?

కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మోదీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా 2024లో కూడా మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడం ఇందుకు కారణమని చెప్పవచ్చు. మోదీ పలు ప్రాంతీయ పార్టీలతో స్నేహంగా మెలిగినట్టు అనిపించినా ఆ స్నేహం కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమేననే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మాత్రం మోదీ అస్సలు తట్టుకోలేడు. అయితే ప్రస్తుతం మోదీ తమకు ఎక్కువ విలువ ఇస్తున్నారంటే తమకు ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. కేంద్రంపై విమర్శలు చేస్తే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని జగన్ భావిస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో గత కొన్నేళ్లుగా చంద్రబాబును మోదీ దూరం పెడుతున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ సన్నాహక కమిటీ సమావేశానికి కేంద్రం చంద్రబాబును ఆహ్వానించడంతో ఎల్లో మీడియా మోదీ బాబు భేటీ గురించి పాజిటివ్ గా పదుల సంఖ్యలో కథనాలను ప్రచురిస్తుండటం గమనార్హం.

ఇదే సమయంలో జగన్ అనుకూల పత్రిక సాక్షి సైతం మోదీ జగన్ తాజా భేటీలో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను ప్రచురించి చంద్రబాబు కంటే జగన్ కే మోదీ దగ్గర ఎక్కువ ప్రాధాన్యత ఉందని వెల్లడించింది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను అమలు చేయడాన్ని గాలికొదిలేసి చంద్రబాబు, జగన్ మోదీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు నచ్చడం లేదు. చంద్రబాబు, జగన్ ఈ విషయంలో ఎప్పుడు మారతారో చూడాల్సి ఉంది.