టీవీకే అధినేత విజయ్ సభలో విషాదం.. చిన్నారులతో సహా 31 మంది మృతి..!

తమిళనాడులోని కరూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సినీనటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. మరో 46 మందికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

విజయ్ సభలో ప్రసంగించేందుకు వస్తున్నారని తెలిసి వేలాదిమంది ఉదయం నుంచే సభా స్థలంలో గుమికూడారు. అభిమానులు, కార్యకర్తలు గంటల తరబడి వేచి ఉన్నారు. అయితే విజయ్ ఆలస్యంగా సభకు చేరుకోవడంతో అక్కడి గుంపు అదుపుతప్పింది. ఆయన ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆరాటం పెరగడంతో ముందువరుసలో ఉన్న వారు ఊపిరాడక కూలిపోయారు. ఆందోళనకర పరిస్థితుల్లో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

వార్త తెలిసిన వెంటనే అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రి చుట్టూ విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తూ ఉండటం అక్కడి వాతావరణాన్ని మరింత దుర్భరంగా మార్చింది.

ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కరూరులో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించమని ఆదేశించాను. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తాం” అని ఎక్స్‌లో స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ కరూరుకు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. జిల్లా స్థాయిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

విజయ్ రాజకీయ అరంగేట్ర సభలపై అభిమానుల్లో ఊహించని ఉత్సాహం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట విషాదం అభిమానులను, కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రాజకీయ సభల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.