ఆంధ్రాలో బీసీ ఓటర్ల శాతం ఎక్కువ. ప్రతి నియోజకవర్గంలోనూ వారి ప్రభావం కనబడుతుంది. అందుకే మొదటి నుండి టీడీపీ బీసీల పార్టీ అనే ముద్ర వేసుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటూ వచ్చింది. మొదటి నుండి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్ పక్షానే ఉంటూ వచ్చారు. వాళ్ళను వేరుచేయడం సాధ్యంకాలేదు. అందుకే టీడీపీ బీసీల మీద వల వేసింది. ఎన్ఠీఆర్ వేసిన ఆ వలలో చిక్కిన బీసీ ఓటర్లు చంద్రబాబు హయాంలో కూడ చిక్కుబడే ఉన్నారు. మూడుసార్లు ఆయన్ను ముఖ్యమంత్రిని చేయడంలో కీలక భూమిక పోషించారు. కానీ 2015 నుండి బీసీల్లో తెలుగుదేశం పట్ల సంతృప్తి మొదలైంది. దశాబ్దాల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా అభివృద్ధి చెందలేదని గ్రహించి పక్కకు తప్పుకున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి ధీటుగా బీసీల ఓట్లను సాధించడానికి కారణం అదే. జగన్ మొదటి నుండి బీసీలను తనవైపుకు తిప్పుకోవాలని పనిచేశారు. వారిని ఆకర్షించేలా అనేక సంక్షేమ హామీలను గుప్పించారు. ఫలితం చంద్రబాబు ఓటమి. ఇక కాపులు సైతం చంద్రబాబుకు గుడ్ బై చెప్పేశారు. పవన్ ఎప్పుడైతే పొత్తును బద్దలుకొట్టుకున్నారో అప్పుడే కాపులు టీడీపీని మర్చిపోయారు. ఇలా కాపులు, బీసీలు మొహం చాటేయడంతో టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. కొన్ని ఓట్ల తేడాతో పదుల సంఖ్యలో నియోజకవర్గాలను కోల్పోవాల్సి వచ్చింది. ఊహించని ఈ తిరుగుబాటులో ఖంగుతిన్న బాబు మరోసారి బీసీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఇటీవల సృష్టించిన పార్లమెంట్ ఇంఛార్జుల, ఇతర కమిటీల్లో బీసీ నాయకులకు పెద్ద పీఠ వేశారు. అధ్యక్ష పదవిని బీసీ నేత అచ్చెన్నాయుడుకు అప్పగించారు. అయినా బీసీల మనసు కరిగినట్టు కనిపించట్లేదు. తాజాగా బీసీ నేతలు కొందరు సమావేశమై ఇకపై ఎవ్వరికీ మద్దతివ్వడం చేయకుండా, సొంతగా పార్టీని పెట్టుకుని రాజకీయ శక్తిగా ఎదగాలని పథక రచన చేస్తున్నారు. నిజానికి బీసీల్లో ఉప కులాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్క ఉప కులంలో ఉండే జనాభా మరీ ఎక్కువ కాకపోయినా అన్నిటినీ కలుపుకుంటే మాత్రం గెలుపోటములను డిసైడ్ చేయగల శక్తిని కలిగి ఉన్నారు వారు. అందుకే వారి కోసం బాబుగారి వెంపర్లాట. ఇక కాపులు కూడ జనసేన టర్న్ తీసుకున్నారు. పవన్ బాబుతో చేతులు కలిపే సూచనలు లేవు. అలా అటు కాపులు ఇటు బీసీలు ఇద్దరూ దూరమై టీడీపీ బలహీనపడిపోయింది.