వాహనం ఎలాంటిదైనాసరే, దాన్ని పద్ధతిగా నడిపితే ప్రమాదం వుండకపోవచ్చు.. నిజానికి, తమ వాహనాన్ని ఎవరు ఎంత జాగ్రత్తగా నడిపినా, ఇతరుల తప్పిదాలతోనూ ప్రమాదాల బారిన పడే అవకాశం వుంటుంది. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటనకు సంబంధించి బోల్డంత రచ్చ న్యూస్ ఛానళ్ళలో కనిపిస్తోంది. యూ ట్యూబ్ ఛానళ్ళలోనూ, వెబ్ మీడియాలోనూ జరుగుతున్న రచ్చ అదనం. ప్రధానంగా ఖరీదైన బైకుల్ని బ్యాన్ చేస్తే చాలావరకు ప్రమాదాలు తగ్గిపోతాయన్నది ఓ విశ్లేషణ. అందులో కొంత నిజం లేకపోలేదు. సాయి ధరమ్ తేజ్ నడిపిన బైక్ ధర 13 నుంచి 18 లక్షలుగా చెబుతున్నారు. ఓ మోస్తరు లగ్జరియస్ కారు వచ్చేస్తుంది ఈ ధరలో. కానీ, బైక్ నడిపితే వచ్చే కిక్కు వేరు. దాని పవర్ అలాంటిది. అంత పవన్ బైక్ చేతిలో వుంటే, మామూలు స్పీడుతో ఎలా వెళతారు.? ఛాన్సే లేదు. హైద్రాబాద్ నగరంలో వేగ పరిమితిని సూచిస్తూ ఎక్కడికక్కడ బోర్డులున్నాయి.
వేలాది చలాన్లు పడుతున్నాయి. కానీ, వాహనాల వేగం తగ్గడంలేదు. లగ్జరీ బైకులే వేల సంఖ్యలో వున్నాయనే ప్రచారం జరుగుతోంది. వీటి మీద చాలా ఎక్కువ చలాన్లు వుండే అవకాశముంది. ఇలాంటి బైకులే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నప్పుడు వీటినెందుకు బ్యాన్ చేయకూడదు.? చెయ్యరు.. ఎందుకంటే, వీటి ద్వారా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం చాలా చాలా ఎక్కువ మరి. అందుకే, వీటి మీద బ్యాన్ వుండదు. సామాన్యుడు చలాన్లకు భయపడతాడు.. ఎందుకంటే, వాడి సంపాదన తక్కువ గనుక. అదే బడా కుటుంబాల వ్యవహారానికి వస్తే.. చలాన్లు కట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అదీ అసలు సమస్య. ఖరీదైన బైకులే కాదు, కార్లూ హైద్రాబాద్ రోడ్ల మీద సాధారణ వాహనదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న సందర్భాలు అనేకం. ట్రాఫిక్ పోలీసులు ఎంతలా కేసులు పెడుతున్నా, చలాన్లు రాస్తున్నా.. ప్రమాదాలు ఆగడంలేదంటే, ఈ చలాన్లు ఖజానా నింపడానికి తప్ప, ప్రమాదాల్ని తగ్గించడానికి ఉపయోగపడ్డంలేదని అనుకోవాలేమో.