ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులట.! తిట్టుకోవడానికేగా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏషీలో నిర్ణయం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అంశాలపై చర్చకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అయితే, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతాయా.? లేదా.? అన్నదానిపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదు.

ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే ఆ లెక్కే వేరు. కానీ, ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడంటే ఇప్పడని కాదు.. పది పదిహేనేళ్ళ క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు.

అసెంబ్లీ సమావేశాలంటే పాలక – ప్రతిపక్షాల మధ్య తిట్ల పర్వమన్న భావన జనంలో పెరిగిపోయింది. ఆ అంచనాలకు మించి, సమావేశాల్ని జుగుప్సాకరంగా మార్చడానికి అధికార పక్షం ప్రతిపక్షం ప్రయత్నిస్తూనే వున్నాయ్.

అసెంబ్లీ సమావేశాల తొలి రోజు.. ప్రారంభమవుతూనే యాగీ జరిగింది. జాబ్ క్యాలెండర్ విషయమై టీడీపీ శాసనసభ్యులు విమర్శలతో కూడిన నినాదాలు చేస్తే, ‘జాబ్స్ గురించి చంద్రబాబుని అడగాలి..’ అంటూ అర్థం పర్థం లేని వాదన తెరపైకి తెస్తూ, అధికార వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఉద్యోగాలపై ప్రతిపక్షానికి కాదు, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వైసీపీ సర్కారు సమాధానం చెప్పాలి.

ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షం మీద ఎదురుదాడికి దిగిందంటే దానర్థం, ప్రజల మీద ప్రభుత్వం ఎదురుదాడికి దిగిందని. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం హామీ ఇచ్చారు.? ముఖ్యమంత్రి అయ్యాక వాటిని ఎంతవరకు నెరవేర్చారు.? అన్నది ప్రశ్న ఇక్కడ.

ప్రారంభమవుతూనే అసెంబ్లీ సమావేశాలు ఇలా షురూ అయ్యాయంటే, ముందు ముందు ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. గత అసెంబ్లీ సమావేశాల్లో బూతుల పర్వం నడిచింది. సో, ఈసారి అంతకు మించి.. అన్నమాట. న్యూస్ ఛానళ్ళకి చిన్న పిల్లల్ని దూరంగా వుంచాలి.. లేదంటే, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో స్కిప్ కొట్టేయాలి ఈ ఐదు రోజులూ.! అంతేనా.?