మన దేశంలో ఏనాడూ ప్రభుత్వాలకు ప్రజలు వారికై వారే భూములను స్వచ్చంధంగా ఇచ్చింది లేదు. మొదట అడ్డుపడటం, ఆ తర్వాత ప్రభుత్వాలు బలవంతంగా ఒప్పించి వారి నుండి భూములు తీసుకోవడం జరిగేవి. కానీ అమరావతి రైతుల మాత్రం భవిష్యత్తు మీద బోలెడు ఆశలు పెట్టుకుని ఆనాటి ప్రభుత్వానికి పెద్దగా కష్టపడే పనిలేకుండా వేల ఎకరాలు ఇచ్చారు. అయితే రైతులు భూములను ఊరకనే ఏం ఇవ్వలేదు. కొన్ని ఖరీదైన హామీలను తీసుకునే ఇచ్చారు. అయినా తరాలుగా జీవనాధారంగా ఉంటూ వచ్చిన తల్లి లాంటి భూములను ఇవ్వడమంటే చిన్న విషయమేమీ కాదు. భూములిచ్చిన రైతులకు ఆనాడు చంద్రబాబుతో పాటు జగన్ సైతం అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. అందుకే నమ్మిన రైతులు ఎన్నికల్లో చంద్రబాబును కాదని జగన్ కు ఓట్లు వేశారు.
తీరా ఎన్నికలు ముగిసిన కొన్నిరోజులకే జగన్ సీఎం హోదాలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అప్పటి నుండి రైతుల్లో ఆందోళన మొదలైంది. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని భూములిచ్చిన తమకు నష్టం జరగనుందని పసిగట్టారు. అందుకే జగన్ మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన వెంటనే పోరాటం మొదలుపెట్టారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. మహిళలే అధికంగా ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం. ఇక ప్రభుత్వం యథారీతిన అణచివేత కార్యక్రమం మొదలుపెట్టింది. రైతులు పోలీసులు చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. రోడ్ల మీద రక్తం చిందించారు. ఎన్నో అవమానాలను పడ్డారు. లాక్ డౌన్ పేరుతో నిబంధనలు పెట్టినా ఇళ్లలోనే దీక్షలు చేశారు. అలా వారి ఉద్యమం ఈరోజుకు 300 రోజులకు చేరుకుంది.
అయినా వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాత్రం కనిపించట్లేదు. పైపెచ్చు ప్రజాప్రతినిధుల నుండే తీవ్ర అవమానాలను ఎదర్కొంటున్నారు. ఉద్యమం మొదలై 300 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతులను పెయిడ్ ఆర్టిస్టులనే అంటున్నారు పాలక వర్గం నేతలు. కొందరు వారంతా కూకట్ పల్లి నుండి వచ్చిన ఆర్టిసులంటే ఒకరు అమరావతి మొత్తం ఎడారే కదా అంటారు. ఇంకొకరు బూతులు తిడతారు. ఒక మంత్రి అయితే ఏకంగా అసలు అమరావతిలో శాసన రాజధాని కూడ అనవసరం లేదు అంటారు. ఇలా అధికార పక్షం నుండి కేసులను, చులకనలను, అవమానాలను భరిస్తూ తమకు న్యాయం చేయాలని ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఆనాడు ప్రభుత్వంలో ఉండి భూములు తీసుకుని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న బాబుగారు అమరావతిని బ్రతికించుకుంటాం అంటారే తప్ప కార్యరంగంలోకి దిగింది లేదు.
ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు కావాల్సిన రాజకీయం ఆయన చేసుకుంటున్నారు. ఇక ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో రాష్ట్ర ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ వారిని చూసి జాలిపడటం మినహా ఇతర ప్రాంతాల ప్రజలు చేసిందేమీ లేదు. రాజధాని ఎక్కడుంటే ఏమిటి, మీకు ఇచ్చిన హామీలు నెరవేరతాయి కదా అంటారు వైసీపీ నేతలు. దేవుడు ఉంటేనే అది గుడి అవుతుంది కానీ ఆ దేవుడే లేనప్పుడు అది ఎంత పెద్ద కట్టడమైనా గుడి కాగలదా.. అంటారు రైతులు. అందుకే పూర్తి రాజధాని అమరావతిలోనే ఉండాలంటారు వారు. ఏది ఏమైనా ఈ రాజకీయ క్రీడలో నిజాయితీగా భూములిచ్చి, హక్కుల కోసం పోరాడుతున్న రైతులు గత 300 రోజులుగా పాలక వర్గం మాటల్లో పెయిడ్ ఆర్టిస్టులుగానే మిగిలిపోయారన్నది మాత్రం చేదు నిజం.