అమర్ రాజా రగడ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదెలా.?

మాట మారింది.. మడమ తిప్పాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది. ‘ఆ పరిశ్రమ గురించి నాకు పెద్దగా తెలియదు. పత్రికల్లో వచ్చింది చదివి తెలుసుకున్నా.. ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పింది. ఆ పరిశ్రమ నిర్వాహకులు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు.. ఈ విషయమై ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమర్ రాజా వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. పెద్దిరెడ్డి అంటే, వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్. రాష్ట్ర రాజకీయాల్ని ఔపోసన పట్టిన వ్యక్తి. చిత్తూరు జిల్లా మీద పూర్తి పట్టున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి చిత్తూరు జిల్లాలోనే వున్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియదని ఎలా అనుకోగలం.? దాదాపు మూడు దశాబ్దాలుగా ఎలాంటి వివాదాల్లేని అమర్ రాజా సంస్థ, రాత్రికి రాత్రి వివాదాల్లో ఇరుక్కుని, పరిశ్రమను ఎత్తివేసే పరిస్థితి రావడమంటే, ఇందులో రాజకీయ కోణమే సుస్పష్టం.

ప్రభుత్వాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారోగానీ, రాజకీయంగా వైసీపీకి ఇది చాలా పెద్ద డ్యామేజ్.. అన్న చర్చ చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ‘మేమే వెళ్ళిపొమ్మన్నాం..’ అని నిన్ననే ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు.. కాలుష్యాన్ని సాకుగా చూపారు. ఇంతలోనే మాట మారింది. ‘మేం వెళ్ళిపొమ్మన్లేదు.. కాలుష్యంపై తగు చర్యలు చేపట్టి, ఫ్యాక్టరీని అక్కడే కొనసాగించొచ్చు..’ అంటూ కొత్త మాట చెబుతున్నారిప్పుడు ప్రభుత్వ పెద్దలు. కానీ, అమర్ రాజా సంస్థ, వెనక్కి తగ్గే అవకాశాలు కన్పించడంలేదు. తమిళనాడు నుంచీ, కర్నాటక అలాగే తెలంగాణ నుంచి ఆహ్వానాలు అద్భుతంగా వుండడంతో, చిత్తూరు నుంచి పరిశ్రమ తరలిపోవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. పరిశ్రమ తరలి వెళితే, వేలాది మంది స్థానికులు నిరుద్యోగులుగా మారతారు. వారి పరిస్థితేంటి.? ఈ డ్యామేజీని కంట్రోల్ చేయడం అధికార పార్టీకి సాధ్యమయ్యే పనే కాదు.