వైద్యో నారాయణో హరి.! అంటే, వైద్యుడు దేవుడన్నమాట. ఔను, దేవుడే మనిషికి ఆయువు పోస్తాడని నమ్ముతాం. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి, ప్రాణం పోయే పరిస్థితి వస్తే.. అప్పుడు ఆయువు పోసేది వైద్యుడు మాత్రమే. మరి, ఆ వైద్యుడి మీదనే దాడి చేస్తే.? మనల్ని కాపాడేదెవరు.? అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే.. రోగుల్ని నిలువునా దోచేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్.
కరోనా అనే కాదు, చిన్నపాటి జ్వరం వచ్చినా లక్షలు గుంజేసే ఆసుపత్రులున్నాయి. ఆ ఆసుపత్రుల్ని ప్రముఖ వైద్యులు నిర్వహిస్తున్నారన్నదాంట్లోనూ ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. విద్య ఎలాగైతే లాభసాటి వ్యాపారమైపోయిందో..వైద్యం కూడా అంతే కానీ, వైద్యులంతా ఒకేలా లేరు.
పోలీసుల్లో అవినీతిపరులున్నట్టు.. న్యాయ వ్యవస్థలో లోపాలున్నట్లు.. వైద్య రంగంలోనూ ‘నర రూప రాక్షసులు’ వున్నారు. అలాగని, వైద్య వ్యవస్థ మీద దాడికి దిగుతామా.? ఆసుపత్రుల్లో దోపిడీ జరిగితే, నిలదీయాల్సిందే.. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.. కోర్టుల మెట్లెక్కొచ్చు. కానీ, వైద్యుల మీద దాడి చేస్తే ఎలా.? చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో నెల జీతానికి పనిచేసే వైద్యులున్నారు. కరోనా నేపథ్యంలో వైద్య వృత్తి అంటే అత్యంత సాహసోపేతమైన వ్యవహారం.
భార్య, తన భర్తను సాకేందుకోసం భయపడుతోంది. భర్త, భార్యను దగ్గరుండి చూసుకోవాలంటే ప్రాణాంతకమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నది వైద్యులే. వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడుతున్నారంటే, దేవుళ్ళ కంటే వాళ్ళే ఎక్కువని అనుకోవాలిప్పుడు. వైద్యరంగంలో దోపిడీపై ఉద్యమించాల్సిందే.. వైద్యం ముసుగులో ప్రజల్ని దోచుకుంటున్నవారికి శిక్ష పడాల్సిందే.
కానీ, అందుకు ఎంచుకునే మార్గాలు, ప్రజాస్వామ్యబద్ధంగా వుండాలి.. మానవీయ కోణంలో ఆలోచించగలగాలి. ప్రాణం అత్యంత విలువైనది. ఆ ప్రాణాల్ని కాపాడే వైద్యుడి విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.