స్త్రీల నెలసరి సమయంలో తలస్నానం చేయకూడదనే అపోహ ఇప్పటికీ చాలామంది మదిలో ఉంది. పాత కాలం నుంచి వస్తున్న ఈ నమ్మకం ఆధునిక కాలంలోనూ కొనసాగుతోంది. ముఖ్యంగా సంప్రదాయాలను పాటించే కుటుంబాల్లో ఈ రకమైన ఆచారాలు గట్టిగా నమ్ముతారు. నెలసరి వచ్చినప్పుడు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే జలుబు వస్తుందని.. బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ ఇవేవీ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.
నిజానికి నెలసరి సమయంలో తలస్నానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి హాని ఉండదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తలస్నానం చేస్తే బ్లీడింగ్ పెరుగుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. హార్మోన్ల వల్లనే బ్లీడింగ్ జరుగుతుంది. నీటి ఉష్ణోగ్రత కారణంగా ఏమీ మారదు. పైగా, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే శరీరానికి రిలీఫ్ లభిస్తుంది. కడుపునొప్పిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. శుభ్రత కూడా మెరుగవుతుంది.
పాత రోజుల్లో తాగునీరు సరిగ్గా లేనప్పుడు, వేడి నీళ్లు సులభంగా అందుబాటులో లేనప్పుడు కొన్ని ఆచారాలు అవశ్యకతలవల్ల ఏర్పడ్డాయి. కానీ ఈరోజుల్లో శుభ్రమైన నీళ్లు, సౌకర్యవంతమైన బాత్రూంలు అందుబాటులో ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో శుభ్రత మరింత ముఖ్యం. ముఖ్యంగా తలస్నానం చేయడం వల్ల శరీరాన్ని తాజాగా, సుఖంగా ఉంచుకోవచ్చు.
తలస్నానం తర్వాత జుట్టు తడిగా ఉంచకూడదు. వర్షాకాలం, చల్లని వాతావరణం లేదా ఏసీలో ఎక్కువ సేపు ఉండే వారు జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవాలి. లేదంటే తలనొప్పులు రావొచ్చు. ఇదీ తలస్నానం వల్ల పీరియడ్స్ పెరగుతున్నాయన్న అపోహకు మూలం.
మొత్తం మీద, నెలసరి సమయంలో తలస్నానం చేయకూడదన్న నమ్మకం ఒక పాతకాలపు ఆచారం మాత్రమే. శాస్త్రీయంగా చూసినప్పుడు దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. పరిశుభ్రత కాపాడుకోవడం, మానసికంగా రిలాక్స్ అవ్వడం కోసం స్నానం అవసరం. తలస్నానం చేయడంలో ఎలాంటి తప్పులేదు. ముఖ్యంగా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే అది శరీరానికి మేలు చేస్తుంది తప్ప హాని కాదు. నిజాలు తెలుసుకుని అపోహలు వదిలేయడి.