సలహాదారులతో జగన్ సర్కారుకి సరికొత్త తలనొప్పి.!

టీడీపీ హయాంలో చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తుల్ని సలహాదారులుగా నియమించుకున్న విషయం విదితమే. ఎవరు అధికారంలో వున్నా, సలహాదారుల అవసరం ఖచ్చితంగా వుంటుంది. ఏ ప్రభుత్వానికైనా సలహాదారులు వుండి తీరాల్సిందే. కానీ, వైఎస్ జగన్ సర్కారు హయాంలోనే సలహాదారుల వ్యవస్థపై తీవ్రాతి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డిని మినహాయిస్తే, సలహాదారులనదగ్గరవారెరూ కీలక సందర్భాల్లో, ప్రభుత్వాన్ని వెనకేసుకురాలేకపోతున్నారు. కొందరు సోషల్ మీడియాలో చేసే కామెంట్ల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఇంకొందరు, నేషనల్ మీడియాలో రాష్ట్ర వాయిస్‌ని వినిపించడంలో ఫెయిలవుతున్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి ఇంతమంది సలహాదారులెందుకు.?’ అని ఇటీవల హైకోర్టు ప్రశ్నించేసరికి, 40 మందికి పైగా సలహాదారులున్న జగన్ సర్కార్, ప్రజలకు సమాధానమిచ్చుకోలేని పరిస్థితికి వచ్చేసింది.

సలహాదారులు, కీలక విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటారు మామూలుగా అయితే. కానీ, న్యాయస్థానాల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయంటే ఈ సలహాదారులు అసలు పనిచేస్తున్నారా.? లేదా.? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరగడం సహజం. మరి, ప్రజలు ఇంకెంతలా ఆలోచిస్తారు.. సలహాదారులు వ్యవహారంపై.? రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సలహాదారుల్లో ఎంతమంది ప్రభుత్వానికి నిజంగా ఉపయోగపడుతున్నారో ఆలోచించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులే సూచిస్తున్నారు. సలహాదారులంటే ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షల్లో ఖచ్చవుతోంది వేతనాలకీ, వారికి కల్పించే సౌకర్యాలకీ. సో, ఆ స్థాయిలో వారంతా ప్రభుత్వానికి.. తద్వారా ప్రజలకీ ఉపయోగపడి తీరాల్సిందే. ఉపయోగపడని పక్షంలో.. అది ప్రభుత్వానికీ, ప్రజలకీ మంచిది కాదు.. పార్టీకి అసలే మంచిది కాదన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.