నూటికి తొంభై ఏడు మార్కులు: వైఎస్ జగన్ ట్వీట్ వైరల్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెన్సేషనల్ ట్వీటేశారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతోపాటు నగరం కూడా పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’ అన్నది వైఎస్ జగన్ వేసిన ట్వీట్.

తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. ఇలాంటి ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది. దానికి తోడు ధన బలం, అధికార బలం వంటివి.. వుండనే వుంటాయి. అయితే, వీటన్నిటికీ తోడు.. ప్రజల నుంచి సంపూర్ణ మద్దతును సాధించగలిగినప్పుడే.. ఇంతటి విజయం అధికారంలో వున్నవారికి లభిస్తుంది.

విపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి కూడా నానా తంటాలూ పడాల్సి వచ్చిందంటే.. వైసీపీ గెలుపు ఎంత నిఖార్సయినదో అర్థం చేసుకోవచ్చు. కాగా, నామినేషన్ల విషయంలో కుట్ర జరిగిందనీ, ఓటర్లను ప్రలోభపెట్టారనీ విపక్షాలు కుంటి సాకులు వెతుక్కుంటూనే వున్నాయి.

అధికార వైసీపీ మాత్రం విజయం తాలూకు సంబరాల్లో మునిగి తేలుతోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తమకు ఇంతటి గెలుపును ఇచ్చాయనీ, విపక్షాలు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి, అడ్డగోలు వాదనలకు తెరలేపుతున్నాయనీ, సద్విమర్శల్ని తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని అధికార వైసీపీ చెబుతోంది.

మొత్తమ్మీద, వైసీపీ సాధించిన ఈ విజయం అపూర్వం.. అద్వితీయం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, విజయాన్ని చూసి పొంగిపోతే.. అది ఓవర్ కాన్ఫడెన్స్ అవుతుందన్న విషయాన్ని అధికార వైసీపీ గుర్తుపెట్టుకోవాల్సి వుంటుంది. ఇదిలా వుంటే, వైఎస్ జగన్ ట్వీటుపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. పెడార్థాలతో విరుచుకుపడుతున్నాయి.