550 రోజుల అమరావతి పోరు: ఇలా ఇంకెన్నాళ్ళు.?

550 days for amaravati movement
550 days for amaravati movement
ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో గడచిన 550 రోజులుగా ‘ఒకే రాజధాని అమరావతి’ అంటూ ఉద్యమం జరుగుతోంది. ఇది పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం అనీ, ఓ కులానికి మాత్రమే పరిమితమైన ఉద్యమం అనీ అధికార పార్టీ విమర్శలు చేయడం చూశాం. అమరావతి పేరుతో చంద్రబాబు హయాంలో భూ కుంభకోణం నడిచిందన్నది వైసీపీ ఆరోపణ. అంతే కాదు, అమరావతిని స్మశానంగా కొందరు పోల్చితే, ఇంకొందరు ఎడారి అన్నారు.. మరికొందరు ముంపు ప్రాంతమన్నారు. అలా అన్నోళ్ళే అమరావతిని శాసన రాజధానిగా చెబుతున్నారు. రాష్ట్రానికి  మూడు రాజధానులు అవసరమా.? అమరావతి సరిపోతుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వుండొచ్చు.
 
కానీ, అమరావతి రాజధానిగా కొనసాగాలన్నదే అందరి అభిప్రాయం. అలాంటప్పుడు, గడచిన రెండేళ్ళలో అమరావతిలో వైఎస్ జగన్ సర్కార్ ఎందుకు రాజధాని సంబంధిత నిర్మాణాలు చేపట్టలేకపోయింది.? అన్న ప్రశ్నకు వచ్చేసరికి అధికార పార్టీ దగ్గర సమాధానం లేదు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెబుతున్నారు గనుక, ఆ దిశగా కాస్తయినా ‘పని’ చేసి వుంటే, అసలు అమరావతి చుట్టూ ఇంత రగడ చోటు చేసుకునేదే కాదు. అమరావతిలో భూ కుంభకోణం జరిగితే, ఆ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చాల్సి వుంది. అది సాధ్యం కావడంలేదు.
 
ఇలా ఎన్నాళ్ళు అమరావతిని త్రిశంకుస్వర్గంలో పడేస్తారు.? అంటే, దానికి సమాధానం దొరకడంలేదు. ఉద్యమంలో ఒక్కో రోజూ పెరుగుతున్న కొద్దీ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం సహజం. ఇంకా ఎక్కువ రోజులు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగనిస్తే.. వచ్చే ఎన్నికలపై ఆ ప్రభావం చాలా తీవ్రవంగా వుండొచ్చు.రానున్న రెండున్నరేళ్ళు రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారుకి అత్యంత కీలకం. ఇప్పుడు రైటన్నవాళ్ళే.. రేపు రాంగ్ అనే పరిస్థితి రావొచ్చు. మరి, జగన్ సర్కార్ ఈ విషయంలో అప్రమత్తంగా వుంటుందా.? అమరావతి సంక్షోభానికి తెరదించుతుందా.? వేచి చూడాలిక.