ఏపీకి మూడు రాజధానులు వస్తాయ్.! కానీ, ఎలా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయా.? వస్తే, ఎప్పుడొస్తాయ్.? చట్ట సభల్లో శాసనాలు చేసేసినంత మాత్రాన మూడు రాజధానులు ఏర్పడిపోతాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా, అది అమలు కాలేదు. చట్ట సభల వ్యవహారాలు ఇలానే వుంటాయ్.

అంతెందుకు, కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఏమయ్యాయ్.? మూడు రాజధానుల వ్యవహారం కూడా అలాగే జరుగుతుందా.? అంటే, అలా జరిగేందుకే అవకాశాలు ఎక్కువగా వున్నాయని చెప్పొచ్చు. ఎక్కడో ‘సలహాదారుల’ తప్పిదం కారణంగా, మూడు రాజధానుల విషయమై వైఎస్ జగన్ సర్కార్ పెద్ద తప్పటగుడుగు వేసేసింది.

‘మూడు రాజధానులు ఖచ్చితంగా వచ్చి తీరతాయ్..’ అంటూ అధికార పార్టీ నుంచి ఎవరు చెప్పినా, అది ‘ప్రగల్భం’ కిందనే మారిపోతోంది తప్ప, వాస్తవంగా నిజమయ్యేలా కనిపించడంలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అవసరాలు.. వంటివాటిని దృష్టిలో పెట్టకుని రాజకీయ నాయకులు ఇలాంటి కీలకమైన అంశాలపై వ్యాఖ్యానిస్తే మంచిది.

‘రాజధాని లేని రాష్ట్రమేంటి.?’ అన్న ప్రశ్న ఎక్కడ తలెత్తినా, సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. మూడు రాజధానుల కారణంగా అమరావతి అయోమయంలో పడిపోవడమే అందుకు కారణం.

వైఎస్ జగన్ సర్కారు కూడా అమరావతిని మూడు రాజధానుల్లో ఒకటిగా ప్రకటించినప్పుడు, ఆ అమరావతిలో అభివృద్ధి చేపట్టకపోవడం శోచనీయమే. మొదలంటూ అమరావతితో పనులు ప్రారంభమైతే, ఆ తర్వాత మూడు రాజధానులకు మార్గం సుగమమవుతుందన్న చిన్న లాజిక్ ఎలా అధికార వైసీపీ మిస్ అవుతోందో ఏమో.!