Three Capitals : జిల్లాల విభజన కంటే ముందు ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టు త్రీ క్యాపిటల్స్. మూడు రాజధానుల విషయమై చట్టం తెచ్చి, దాన్ని తమ స్వహస్తాలతోనే వైఎస్ జగన్ సర్కారు చింపేయాల్సి వచ్చింది.
తమ వాదనలో పస వుండి వుంటే, మూడు రాజధానుల విషయమై వైఎస్ జగన్ సర్కారుకి ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు.! కానీ, తప్పటడుగు పడింది.
ముందూ వెనుకా చూడకుండా అసెంబ్లీలో వైఎస్ జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేసేయడం, దానికి అనుకూలంగా ‘కమిటీ నివేదిక’ తెప్పించుకోవడం, ఆ తర్వాత అడ్డగోలుగా అటు అసెంబ్లీలో, ఇటు శాసన మండలిలో బిల్లు పెట్టేసి.. నానా గందరగోళం నడుమ ‘మమ’ అనిపించేయడం.. ఇలా చాలా తప్పిదాలు జరిగాయి మూడు రాజధానుల విషయంలో.
నిజానికి, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం ఓ మంత్రుల కమిటీనో, అధికారుల కమిటీనో వేసి చర్చలు జరిపితే, మూడు రాజధానులకు అసలు సమస్య వచ్చేదే కాదు.
అయ్యిందేదో అయిపోయింది.. ఇంత జరిగాక కూడా ప్రభుత్వం ఆ దిశగా సరైన అడుగులు వేయడంలేదు.
ఇదిలా వుంటే, రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను జగన్ సర్కారు 13 నుంచి ఏకంగా 26కి పెంచేసింది. జిల్లా కేంద్రాల్ని ‘అందరికీ అందుబాటులో’ అన్న ప్రాతిపదికన ఎంపిక చేశారు.
మరి, రాజధాని విషయంలో ఎందుకు అలా ఒప్పుకోవడంలేదు.? అన్న ప్రశ్నకు వైసీపీ సర్కారు వద్ద సమాధానమే లేదాయె.
మూడు రాజధానులు.. ఓ ఫెయిల్యూర్ ఎపిసోడ్. 26 జిల్లాలు మాత్రం, సక్సెస్‌ఫుల్ స్టోరీ.!