టీపీసీసీ చీఫ్ రచ్చ మళ్లీ మొదలైంది

 

టీపీసీసీ చీఫ్ రచ్చ మళ్లీ మొదలైంది

 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గందరగోళం మొదలైంది.  కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం అంశాన్ని ఎవరు లెవనెత్తారో కానీ పార్టీలో లుకలుకలు స్టార్టయ్యాయి.  చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ ను తొలగించాలని కొందరు అంటుంటే అవసరం లేదని ఇంకొందరు అంటున్నారు.  ఈ విషయంపై మొదటగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు.  ఆయనైతే నిర్మొహమాటంగా స్పందించిన ఆయన చీఫ్ పదవి నుండి ఉత్తమ్ కుమార్ ను తొలగించాల్సిన అవసరమే లేదని అన్నారు. 
 
కొందరు నేతలు చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉండగా జగ్గారెడ్డి మాత్రం తానైతే రేవంత్ రెడ్డిని చీఫ్ పదవికి ఎంపిక చేయవద్దనే అంటానని, రేవంత్ విషయంలో తనకు కొన్ని అపోహలు ఉన్నాయని, అవి తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు.  ఉత్తమ్ కుమార్ తన భార్యను గెలిపించుకోలేనంత మాత్రాన చీఫ్ పదవి నుండి తీసేయాల్సిన పని లేదని, అయినా రేవంత్ వేరే పార్టీ ఉండి వచ్చి కాంగ్రెస్ తరపున గెలిచారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామందిని గెలిపిస్తానని అన్నారు ళ్, ఏమైంది.. గెలిపించలేకపోయారు కదా అంటూ ఎద్దేవా చేశారు. 
 
అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డిని చీఫ్ పదవికి ఎంపిక చేసే ప్రక్రియే మొదలైతే తన రాజకీయం తాను చేస్తానని, ఒకవేళ తన మీద రాజకీయ కక్ష సాధింపులు జరిగితే తన కూతురు జయారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తానని హెచ్చరించారు.  ఇలా  పీసీసీ చీఫ్ విషయంలో రచ్చ జరగడం ఇది తొలిసారి ఏమీ కాదు.  సంవత్సరానికో, ఆరు నెలలకో ఒకసారి ఈ చర్చ తెరపైకి రావడం, కొన్నిరోజులు వాదోపవాదాలు, రాజకీయాలు జరగడం, ఆ తర్వాత సద్దుమణిగిపోవడం మామూలే.  పలుసార్లు ఈ తంతును చూసిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ ఉండేదే కదా అంటూ లైట్ తీసుకుంటున్నారు.