మళ్లీ మళ్లీ లాక్ డౌన్ అంటే ప్రభుత్వ అసమర్థతే 

కరోనా మహమ్మారి భారత్ మీద పంజా విసురుతోంది.  ఇప్పటికే దేశంలో 5.66 లక్షల కేసులు నమోదవగా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటీ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇంకా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.  ఇదిలా ఉండగా కేసులు అదుపులోకి రాని తెలంగాణలో కూడా మరోసారి లాక్ డౌన్ పెట్టాలని కేసీఆర్ సర్కార్ చూస్తోంది.  హైదరాబాద్ సిటీలో రేపో మాపో లాక్ దౌన్ విధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తోంది.  ఇప్పటికే రెండు నెలలు పైగా లాక్ డౌన్ అనుభవించిన జనం మళ్లీ లాక్ డౌన్ అనేసరికి కంగారుపడుతున్నారు. 
 
 
ఇలా లాక్ డౌన్ వేసుకుంటూ తీసుకుంటూ ఉండటమేనా అంటున్నారు.  నిజమే ఇలా రెండవసారి లాక్ డౌన్ ఆప్షన్ తీసుకోవడం అంటే అది ఫైల్యూర్ అనే అనుకోవాలి.  మొదటిసారి లాక్ డౌన్ పెట్టినప్పుడే ప్రభుత్వం గనుక భారీ సంఖ్యలో టెస్టులు చేసి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు.  కానీ లాక్ డౌన్ పెట్టి జనాల్ని ఇళ్లలో బంధీలను చేస్తే సరిపోతుందనుకున్న సర్కార్ పరీక్షలు, వైద్య సదుపాయాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టలేదు.  ఫలితం అన్ లాక్ అనంతరం కేసులు విపరీతంగా పెరిగాయి.  మెడికల్ ఇన్ఫ్రాలో అలసత్వం స్పష్టంగా బయటపడింది. 
 
 
లాక్ డౌన్ అనేది కరోనా కట్టడికి శాశ్వత పరిష్కారం కానే కాదు.  పెరిగే కేసుల సంఖ్యను లాక్ డౌన్ కాస్త తగ్గిస్తుందే తప్ప పాత కేసులను నివారించదు, అలాగే కొత్త కేసులను పూర్తిగా అదుపు చేయలేదు.  సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గం అంటే పెద్ద సంఖ్యలో టెస్టులు నిర్వహించి, పాజిటివ్ కేసులతో పాటు వారి కాంటాక్టులను ట్రేస్ చేసి అవసరమైన వారిని క్వారంటైన్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం, వైద్య సదుపాయాలను పెద్ద ఎత్తున పెంచుకోవడం చేయాలి.  కానీ తెలంగాణ సర్కార్ మాత్రం కేసుల పెరుగుతున్న కొద్ది ఆసుపత్రుల్లో బెడ్లు రెడీగా ఉన్నాయని, టెస్టుల సంఖ్య పెంచుతున్నామని అంటున్నారే తప్ప ఎక్కడా వైరస్ కట్టడి చేసేలా ప్రభావంతమైన వైద్య సదుపాయాలను మాత్రం కల్పించలేకపోతోంది.  వైరస్ విజృంభణ అయ్యే పరిస్థితిలో లాక్ డౌన్ అంటున్నారు.  ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది తప్ప తెలివైన పని అనిపించుకోదు.