YS sharmila: నేడు గవర్నర్ ను కలవనున్న వైఎస్ షర్మిల.. ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏంటి?

YS sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఆమె రాష్ట్ర రాజకీయాలపై గవర్నర్ తో చర్చలు జరపడం కోసమే భేటీ కాబోతున్నారని సమాచారం. అమెరికాలో అదానీ పై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అదానీ నుంచి భారీ స్థాయిలో లంచం అందుకున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

సేకీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా అదానీ జగన్మోహన్ రెడ్డికి ఏకంగా 1750 కోట్ల రూపాయలను ముడుపుగా చెల్లించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి ఇటు కూటమి ప్రభుత్వం ఇటు షర్మిల కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈయన పై ఏ విధమైనటువంటి అధికారిక చర్యలు మాత్రం తీసుకోలేదు. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాయడమే కాకుండా ఈ విషయంలో సిబిఐ ఎంక్వయిరీ కూడా చేయాలని చంద్రబాబు నాయుడుని కోరారు.

ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో అదానీతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దుచేసి వాటిపై కూడా విచారణ చేయాలని ఈమె లేఖ రాశారు. తాజాగా ఇదే విషయం గురించి మరోసారి షర్మిల గవర్నర్ ను కలవబోతున్నారని సమాచారం.అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఈ ప్రభుత్వం విచారణ జరపాలని కోరనున్నారు. అదానీ, జగన్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలపై ఈ ప్రభుత్వం సీరియస్ గా విచారించాలని, అందుకు అవసరమైన ఆదేశాలను కూడా జారీ చేయాలని ఈమె గవర్నర్ ను కోరబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా అదానీ జగన్మోహన్ రెడ్డికి వేలకోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అంటూ చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని వైకాపా నాయకులు మాత్రం పూర్తిగా తప్పుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. చంద్రబాబు హయామంలో కంటే కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్కువ ఖర్చుకే విద్యుత్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఒప్పందం జరిగిందని చెప్పుకు వస్తున్నారు.