ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు సుబ్బరాజు.. శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు!

ఎన్నో సినిమాల్లో విలన్, సహాయ పాత్రలలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. సడన్ గా తన పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను వివాహం చేసుకున్న విషయాన్ని వెల్లడించాడు. బీచ్ దగ్గర పెళ్లి బట్టలతో ఉన్న తమ జంట ఫోటో షేర్ చేశాడు సుబ్బరాజు. ఇదివరకు చాలా ఇంటర్వ్యూలలో తన పెళ్లి గురించి ప్రశ్నిస్తే తనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుకొచ్చిన సుబ్బరాజు తన 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఖడ్గం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుబ్బరాజు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. భీమవరానికి చెందిన ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ కోసం వెళ్లిన సుబ్బరాజు అనుకోకుండా కృష్ణవంశీ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు. ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆర్య, శ్రీ ఆంజనేయం, నేనున్నాను, సాంబ, భద్ర, పౌర్ణమి వంటి చాలా సినిమాలలో నటించాడు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు వందకు పైగా సినిమాల్లో నటించాడు.

ఎక్కువగా విలన్ వేషాలు వేసిన సుబ్బరాజు కొన్ని సినిమాలలో కామెడీ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఇటీవల రాకేష్ వర్రీ నటించిన జితేందర్ రెడ్డి సినిమాలో మంచి పాజిటివ్ రోల్ చేశారు సుబ్బరాజు. ఇంకా ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదల కావలసి ఉంది. చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న తమ అభిమాన నటుడు ఇన్నాళ్ళకైనా పెళ్లి చేసుకున్నందుకు ఆనందిస్తున్నారు అతని అభిమానులు.

అయితే పెళ్లికూతురు కి సంబంధించిన వివరాలు ఏవి బయట పెట్టలేదు సుబ్బరాజు. పెళ్లి కూడా ఎలాంటి హడావిడి చాలా తక్కువ మంది సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఫోటోను చూసినవారు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళిలా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక సుబ్బరాజుకి ఇటు నెటిజెన్సే కాకుండా అటు సినీ ప్రముఖులు కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.