నోరుజారిన వైసీపీ నేత.. పండగ చేసుకున్న జనసైనికులు
ప్రింట్, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్రాభవం ఎక్కువగా ఉన్న రోజులివి. పత్రికలు, టీవీ ఛానెళ్లను కంట్రోల్ చేయొచ్చుకానీ సోషల్ మాధ్యమాన్ని కట్టడి చేయడం కష్టం. పొరపాటున ప్రత్యర్థుల చేతికి చిక్కితే ఒక ఆట ఆడేసుకుంటారు. తాజాగా వైసీపీ నేత ఒకరు ఇలానే సోషల్ మీడియా ట్రోలింగుల్లో ఇరుక్కుపోయారు. ఆయనే అద్దేపల్లి శ్రీధర్. టీవీ ఛానెల్లో కోర్టులపై వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల విమర్శలు, వారికి నోటీసులు వెళ్లడం అనే అంశం మీద ఆయన చర్చకు వచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని డిఫెండ్ చేసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ కోర్టుల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తన పార్టీ నేతలు, కార్యకర్తల్లో 90 శాతం మంది ఇల్లిటరెట్స్ అని, వారికి సామాజిక మాధ్యమాల్లో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు రాయాలి అనేది తెలియదని అనేశారు. దీంతో రగడ మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా అయితే ఇలా కెమెరా ముందు కూర్చొని నోటికొచ్చింది మాట్లాడి పరువు తీస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
ఎవ్వరూ ఆయన వైపు మాట్లాడలేదు. ఇదంతా చూస్తున్న మరొక వర్గం జనసేన కూడా వ్యవహారంలో తలదూర్చింది. మా పార్టీలో ఉన్నన్ని రోజులు మీకు బలంగా సపోర్ట్ చేస్తూ వచ్చాం. అప్పుడు మా విలువ మీకు తెలీలేదు. మమ్మల్ని వీడి ఏదో దక్కుతుందని వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వాళ్ల కార్యకర్తలతోనే చీవాట్లు తింటున్నారు. ఒక్క కార్యకర్త కూడా మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటూ విమర్శలు స్టార్ట్ చేశారు. దీంతో అద్దేపల్లి సైతం వారిపై కౌంటర్లు విసిరారు.
వ్యవహారం కాస్త పవన్ మీదికి కూడా మళ్లింది. మా లీడర్ గొప్పవాడు, ఆయన్ను అనవసరంగా విమర్శించి పార్టీ వీడారు. కాబట్టి మీకు జరగాల్సిందే అని కొందరు జనసైనికులు అంటే దానికి అద్దేపల్లి మీ లీడర్ గురించి నాకు తెలుసు, చట్టపరమైన చర్యలకు సిద్దంగా ఉండండి అంటూ వాదనకు దిగారు. ఇలా వివాదం కాస్త రభస రభస అయిపోయింది. మొత్తానికి వైసీపీ కార్యకర్తలు అద్దెపల్లి వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడితే జనసేన సపోర్టర్స్ మాత్రం పండగ చేసుకున్నారు.
