‘హరి హర వీర మల్లు’ నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న, క్రిష్ జాగర్లమూడి రచించి, దర్శకత్వం వహిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ నుంచి అద్భుతమైన బహుమతి లభించింది. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుండి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఒక కొత్త పోస్టర్ ఈరోజు విడుదలైంది. శక్తిమంతమైన పోస్టర్‌లో గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎరుపు సాంప్రదాయ దుస్తులు, నలుపు పైజామా ధరించి ఉన్నారు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న శత్రువులు నేల మీద పడి ఉండటం, మట్టి దుమ్ము లేవడం మనం గమనించవచ్చు. ఈ చిత్రానికి ‘ది లెజెండరీ హీరోయిక్ అవుట్‌లా’ అని ఉప శీర్షికను జోడించి, ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ’ అని చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

నేపథ్య సంగీతం పోస్టర్ ను మరింత శక్తిమంతంగా మార్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మొఘలులు మరియు కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది.

ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు మరియు పరిశోధనలకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. జాతీయ అవార్డు, అకాడమీ అవార్డు గ్రహీత స్వరకర్త ఎం.ఎం. కీరవాణి శ్రోతలకు విందుగా ఉండేలా అద్భుతమైన సంగీతంతో అలరించడానికి వస్తున్నారు. విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మరియు తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.

పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీర మల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ. తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు చిత్రీకరణకు సంబంధించిన ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.