దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబందించి ఈడీ విచారణలు కాస్త గ్యాప్ ఇవ్వడంతో… రిలాక్స్ గా కనిపిస్తున్న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు సుఖేస్ చంద్రశేఖర్ లీకులు తెగ టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు! ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించిన సుఖేష్… కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆరెస్స్ ఆఫీస్ లో రూ.15 కోట్ల డబ్బులు.. ఎమ్మెల్సీ స్టిక్కరున్న రేంజ్ రోవర్ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడు మరోసారి షాకింగ్ విషయాలు వెల్లడించాడు సుఖేష్. అవును… మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశాడు. ఎమ్మెల్సీ కవితతో జరిపిన సంభాషణ అంటూ చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు సుఖేష్ లాయర్. అక్కా అంటూ తెలుగులో జరిపిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ లిస్ట్ లో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితతో చాట్ ను సుఖేష్ తాజాగా బయటపెట్టాడు. “కవితక్క – టీఆరెస్స్” అనే పేరుతో సేవ్ అయిన కాంటాక్ట్ నెంబర్ తో చాట్ చేసినట్లు.. అది కూడా కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు సుఖేష్ తెలిపాడు. అక్కా అంటూ పలుమార్లు చాట్ లో సంభోధించిన సుఖేష్… డబ్బు డెలివరీ చేశానంటూ చాట్ లో పేర్కొన్నాడు. “స్పోకెన్ టూ మనీష్” అని రిప్లై కూడా ఇచ్చాడు. అయితే మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేయగా.. తాజా లేఖ ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ వరకూ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.