`దేశంలో ఉండేవి రెండే కూటములు. ఒకటి ఎన్డీఏ, రెండు యూపీఏ. మూడో కూటమి అవకాశమే లేదు. ఏ కూటమికైనా కాంగ్రెస్, బీజేపీ యాంకర్లుగానే ఉంటాయి. కూటమి కట్టాలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవాలి లేదా బీజేపీతో జట్టుకట్టాలి. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడతానంటున్నారు. ఈ రెండు పార్టీలు లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఎలా సాధ్యపడుతుంది..` ఇవి కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేసిన వ్యాఖ్యానాలు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు దాసోహం అయిపోయారడానికి ఈ మాటలు ఉదాహరణగా భావించవచ్చు.
అదాలావుంచితే- కాంగ్రెస్ లేకుండానే ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మొదలయ్యాయి. సమాజ్‌వాది పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీ చెట్టాపట్టాలు వేసుకున్నాయి. అక్కడ ఉన్న 80 స్థానాల్లో చెరో 38 సీట్లను పంచుకున్నాయి. ఓ రెండు సీట్లను కాంగ్రెస్‌కు విదిలించాయి.
ఆ రెండూ తల్లీ కొడుకులవి. ఒకటి అమేథి, రెండోది రాయబరేలి. అమేథిలో రాహుల్‌గాంధీ, రాయబరేలీలో సోనియాగాంధీ ఎంపీలుగా ఉన్నారు. తమ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించకపోతే-అక్కడా తాము అభ్యర్థులను నిలబెడతామని అఖిలేష్ యాదవ్, మాయావతి కూడబలుక్కుని ప్రకటించారు. కాంగ్రెస్‌తో తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఆ ఇద్దరు నేతలూ తీసుకున్న నిర్ణయం..మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలవరానికి గురి చేసేదే. కంటి మీద కునుకు లేకుండా చేసేదే. ఇంతకుముందే చెప్పుకొన్నట్టు- ఆయన కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయారు. ఓటుకు కోట్లు కేసులే కావచ్చు, పోలవరం, పట్టిసీమ పేరుతో చోటు చేసుకున్న భారీ అవినీతే కావచ్చు. కారణాలేమైనప్పటికీ.. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముందు మోకరిల్లారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఓ జాతీయ పార్టీ అండ అత్యవసరం. ఆయన ఆశ్రయించిన జాతీయ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండటం అవసరం.
కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖాయమైంది. ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేశాయి. `కాంగ్రెస్, బీజేపీ లేకుండా కూటమి అసాధ్యం..` అంటూ చంద్రబాబు చెప్పిన మాటలను ఇక్కడ మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలు అల్లాటప్పావి కావు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. స్వయంగా సోనియా, రాహుల్‌గాంధీలు ప్రాతనిథ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాంగ్రెస్‌కు నిలవనీడ లేకుండా చేశాయి ఎస్పీ-బీఎస్పీ కూటమి.
నిజానికి- ప్రధానమంత్రి ఎవరనేది నిర్ధారించేది కూడా యూపీ రాజకీయాలే. ఈ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. మన తెలుగువారికి అంత రాజకీయ పరిజ్ఞానం లేదు అని చంద్రబాబు తనకు తానుగా సర్టిఫికెట్ ఇచ్చుకోవడం వల్లే 25 ఎంపీ సీట్లను ఇస్తే, ప్రధానిని నిర్ణయిస్తామని ఆయన పలుకుతుంటారు. అది వేరే విషయం. ఎస్పీ-బీఎస్పీ కెమిస్ట్రీ అనూహ్య ఫలితాలను సాధించింది.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట గోరఖ్‌పూర్. వరుసగా అయిదుసార్లు ఆయన ఈ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఈ కంచుకోటను బద్దలు కొట్టాయి ఎస్పీ-బీఎస్పీ పార్టీలు. ఉమ్మడిగా పోటీ చేసి ఘన విజయం సాధించాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంతో కమలనాథుల మైండ్ బ్లాక్ అయింది. తాము కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది పసిగట్టే ఎస్సీ-బీఎస్పీ జట్టు కట్టాయి. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమాగా చెబుతున్నాయి.
పొత్తు, సీట్ల సర్దుబాటు సందర్భంగా ఎస్పీ-బీఎస్పీ నేతలు వరుసగా చేపట్టిన సమావేశాల్లో కాంగ్రెస్ గురించి చర్చించాయి. అంతే తప్ప, కాంగ్రెస్‌కు `అనధికార ప్రతినిధి`గా వ్యవహరిస్తోన్న చంద్రబాబు దౌత్యం గురించి ప్రస్తావన అసలు చర్చకే రాలేదట.
ఎస్పీ-బీఎస్పీల సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌కు చోటు ఇవ్వకపోవడం పట్ల దేశంలో మొట్టమొదటగా హర్షించదగ్గ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అచ్చంగా మమతా బెనర్జీనే. కాంగ్రెస్ రహితంగా కూటమి కట్టడాన్ని తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. ట్విట్టర్ వేదికగా హర్షం వెలిబుచ్చారు. కాంగ్రెస్ లేని ఏ కూటమికైనా తాను మద్దతు ఇవ్వడానికి సిద్ధమంటూ మమతా బెనర్జీ ఓ సందేశాన్ని ఇచ్చినట్టయింది.
అటు కాంగ్రెస్‌కు గానీ, ఇటు బీజేపీకి గానీ సమాంతర దూరాన్ని పాటిస్తోన్న నిఖార్సయిన రాజకీయ నాయకురాలు ఆమె. ఎవరికీ భయపడని మనస్తత్వం మమతా దీదీది. దీనికి కారణం- ఆమెకు ఎలాంటి కేసుల భయాలూ లేవు. ఏ అవినీతి రంపటా లేదు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కేంద్రంలో అధికారంలోకి వస్తే- తనను జైలు పాలు చేస్తారనే భయం, సంకోచం ఎంత మాత్రమూ ఆమెకు లేదు. అవినీతి మరక అంటని ఆధునిక రాజకీయవేత్తగా ఆమెను చెప్పుకోవచ్చు.
ఎస్పీ-బీఎస్పీల పొత్తుకు మమతా బెనర్జీ జై కొట్టడం చంద్రబాబును ఇబ్బందులకు గురి చేసేదే. ఇరకాటంలో పడ వేసేదే. కాంగ్రెస్‌తో కలిసి ఉండే ఏ పార్టీకీ తాను మద్దతు ఇవ్వబోనని ఆమె దీని ద్వారా కుండబద్దలు కొట్టారు. ఇది చంద్రబాబు చేస్తోన్న దౌత్యానికి విఘాతం కలిగిస్తోంది. ఇక ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు `కాంగ్రెస్ సహిత కూటమి` మద్దతును కూడగట్టడానికి కోల్‌కత వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎస్పీ, బీఎస్పీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఓ పక్కకు వచ్చేసినట్టే. వారందర్నీ కేసీఆర్ ఒకే గొడుగు కిందకు తీసుకుని రావచ్చు. ఇదే గొడుగులోకి నవీన్ పట్నాయక్ వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్, బీజేపీలతో సమదూరాన్ని పాటిస్తున్న నేతలందరూ ఈ విధంగా ఒకే చోట చేరి, జాతీయ రాజకీయాలను శాసించే అవకాశాలు లేకపోలేదు.
ఇక్కడ చంద్రబాబు పాత్ర ఏమిటనేది చర్చనీయాంశం. కేసీఆర్ తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలను తాను చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు ఆస్కారమే లేదని చంద్రబాబు.. కేసీఆర్‌ను విభేదించారు. పైగా- తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టి కేసీఆర్ ఆగ్రహానికీ గురయ్యారు.
ఫలితం- చంద్రబాబుకు ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయం కానేకాదనే అనుకోవాలి. తాను చేస్తోన్న ప్రయత్నాల్లో ఆటంకాలు కలిగిస్తోన్న చంద్రబాబుకు ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్ చోటిస్తారని అనుకోవడానికీ వీలులేదు. చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్ పంచన చేరిపోయారు కాబట్టి, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఆయనను చేరదీస్తాయనీ భావించలేం.
ఇక మిగిలింది కాంగ్రెస్. ఆ పార్టీతో ఇంకా కలిసే ఉన్న దేవేగౌడ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్ వంటి నేతలే. చంద్రబాబు కూడా ఆ జాబితాలో ఒకరిగా మిగిలిపోతారే తప్ప, అంతకు మించి ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గనక చంద్రబాబుతో పొత్తు వద్దు.. అనుకుంటే మాత్రం ఆయన పరిస్థితి దబడి దిబిడే. జాతీయ రాజకీయాల్లో ఆయన ఏకాకిగా మిగిలిపోక తప్పదు.