Vishwambara – Mass Jathara: విశ్వంభర – మాస్ జాతర.. వారం గ్యాప్‌లోనే వస్తున్నారుగా..

టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ రిలీజ్ గందరగోళం మొదలైంది. భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడం, వాటి మధ్య ఉన్న గ్యాప్ వలన కలిగే ప్రభావం అన్నీ హాట్ టాపిక్ గా మారాయి. తాజా ఉదాహరణగా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద ఒక వారం గ్యాప్ లో రావడానికి సిద్ధమవుతున్నాయి.

విశ్వంభర జూలై 24న రాబోతుందన్న బలమైన బజ్ ఉంది. ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ కూడా ఇదే డేట్‌కి వచ్చిందన్న సెంటిమెంట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. కానీ ప్రాజెక్ట్ పనులు తుది దశలో ఉన్నందున అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు రవితేజ ‘మాస్ జాతర’ సినిమా జూలై 18న రిలీజ్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం సీరియస్‌గా వర్క్ చేస్తోంది.

ఈ రెండు సినిమాలూ మొదట సంక్రాంతికి రావాల్సినవే. కానీ విభిన్న కారణాలతో వాయిదా పడ్డాయి. మాస్ జాతర షూటింగ్ రవితేజ ప్రమాదం వల్ల ఆలస్యమైంది. విశ్వంభర టీజర్ మీద వచ్చిన నెగటివ్ టాక్, విఎఫెక్స్ పనులు ఆలస్యం కావడం వల్ల జూలై వైపు వచ్చారు. ఇప్పుడు ఒక్క వారం గ్యాప్‌తో బాక్సాఫీస్ మీద ప్రభావం ఉండకమానదన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

అయితే చిరంజీవి, రవితేజ మధ్య బాండింగ్ బాగుండటంతో, ఈ రిలీజ్ క్లాష్ పెద్దగా నెగటివ్‌గా మారదనేది అభిమానుల ఆశ. ఇద్దరికీ బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌లో భారీ క్రేజ్ ఉంది. వీటి మధ్య గ్యాప్ తగ్గినా, కంటెంట్ బలంగా ఉంటే ఫలితాలు సానుకూలంగానే ఉండొచ్చు. కానీ రిలీజ్ డేట్లపై అధికారిక క్లారిటీ రాకముందే ఈ హైపుతో అభిమానులలో విషయం చర్చనీయాంశంగా మారింది.