Bihar: బీహార్‌ను కుదిపేస్తున్న అకాల వర్షాలు.. 80 మంది మృతి!

బీహార్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా వర్షాలు, పిడుగుల వల్ల ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ మండల్ తెలిపారు. అంతేకాకుండా, వర్షాల కారణంగా పంటలపై కూడా భారీ నష్టం ఏర్పడిందని చెప్పారు. హఠాత్తుగా వచ్చిన ఈ వర్షాలు రైతుల జీవనాధారాన్ని నేలకూల్చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తరఫున సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని చెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ విషాద ఘటనలపై తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, వర్షాల కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి పంటలు నేలకూలిపోయాయని తేజస్వి చెప్పారు.

గోదాముల్లో నిల్వ ఉన్న గోదుమలు కూడా నీటమునిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో, రైతులు తీవ్ర ఆర్థిక బాద్యతల్లో నలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకృతి తుఫానుల పట్ల ముందస్తు హెచ్చరికలు, ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం లాంటి చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.