Congress: కాంగ్రెస్ న్యూ ప్లాన్.. ఈసారి గుజరాత్ నుంచే..?

గుజరాత్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) 84వ సమావేశం భారీ ఉత్సాహంతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గడ్డపై ఈ స్థాయి సమావేశం పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోదీని ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీతో పాటు దాదాపు 2000 మంది నేతలు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సర్దార్ పటేల్‌ను బీజేపీ ఎలా ‘ఓన్’ చేసుకుందో, కాంగ్రెస్ నేతలు అదే ఉత్సాహంతో కాంగ్రెస్ వారసత్వాన్ని రీ కేమ్ చేశారు. “పటేల్, గాంధీ, నెహ్రూ వారసులు మేమే” అని మరోసారి బలంగా చెప్పారు. 30 ఏళ్లుగా గెలుపు చూడని గుజరాత్ నుంచే కొత్త ప్రణాళికను మొదలుపెడుతూ కాంగ్రెస్ నాయకత్వం మెరుగైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. జిల్లాల స్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

తాజా సమావేశంలో కీలకంగా రాష్ట్ర స్థాయి నాయకులకు కౌంటర్లు ఇచ్చారు. ఇకపై జిల్లా అధ్యక్షులకే పూర్తి అధికారాలు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షులు స్వయంగా అభ్యర్థుల ఎంపికలో పాల్గొనడం, నిధుల వాడకంపై ప్రత్యక్షంగా నియంత్రణ కలిగి ఉండేలా కొత్త వ్యవస్థను తెచ్చారు. అలాగే పార్టీ శిక్షణ, సోషల్ ఇంజినీరింగ్, ప్రచార విధానాలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ నేతలు పార్టీ పునరుజ్జీవనానికి బలమైన బాట వేసినట్టు కనిపిస్తోంది. బీజేపీని గుజరాత్ నుంచే నిలదీయాలని, పార్టీ అంతర్గతంగా సమగ్ర మార్పులు చేసి 2029 కేంద్ర ఎన్నికలలో పట్టు సాధించాలని చూస్తున్నారు. మరి ఈ సంకల్పం వాస్తవంగా మారి, కాంగ్రెస్ మళ్లీ పోటీలోకి వస్తుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.