RK Roja: ఆ అధికారి వలన.. రోజా కాంపౌండ్‌కి మళ్లీ తిప్పలు?

గత వైసీపీ పాలనలో జరిగిన “ఆడుదాం ఆంధ్రా” పేరుతో జరిగిన అవినీతిపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. శాప్‌లో డిప్యూటేషన్ మీద పనిచేసిన ఓ అధికారి వివాహేతర బంధం ఈ అవినీతిని బయటకు తీసుకువచ్చిందన్న వాదన ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. కడప జిల్లాకు చెందిన ఆ అధికారి, రోడ్లు-భవనాల శాఖలో ఇంజినీర్‌గా ఉండగా, వైసీపీ హయాంలో శాప్‌లోకి తీసుకుని వెళ్లారు. ఈ వ్యవహారంలో అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రపై శంకలు మొదలయ్యాయి.

ఆ అధికారి పై అధికారులు నమ్మకం పెట్టుకుని టెండర్లను ఓ వైపు ఎలా నిర్వహించాలో చెప్పగా, ఆయన చెప్పినట్టే వ్యవహరించినట్టు సమాచారం. టెండర్లలో అక్రమాలున్నా అవి బయటపడకుండా చూసిన అతను, ఎవరి వాటా వారికి సమంచితంగా పంపించాడట. అయితే ఇంత చక్కటి ప్లాన్‌ను అతని వ్యక్తిగత జీవితం తారుమారు చేసింది. నందిగామకు చెందిన ఓ మహిళతో ఉన్న సంబంధం వల్ల అసలు కథ బయటపడింది.

ఆ మహిళపై అధికారి తన కుటుంబానికి చెందిన భూమిని కియా పరిశ్రమ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అతని భార్యాపిల్లలు స్పందించగా, వారిపై దాడి చేసినట్టు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు అసలు వ్యవహారం మొత్తం బయటకు తీసుకువచ్చారు. విచారణలో అధికారే అన్నీ ఒప్పుకున్నాడని సమాచారం.

ఇక అసలైన షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ అధికారి ఆమెకు వివిధ అకౌంట్ల ద్వారా రూ.12 కోట్ల వరకు బదిలీ చేశాడట. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కింద వచ్చిన సొమ్మే ఇదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రోజా, బైరెడ్డిలపై ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. అధికారిని పట్టిన వ్యక్తిగత బంధమే, పెద్ద స్కాం బయటపడేలా చేసింది. ఇక ఈ వ్యవహారంపై విచారణ ఎటు దారి తీస్తుందో చూడాలి.