Thalapathi Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయకన్’ షూటింగ్ జరుపుకుంటోంది. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఆ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోనే ఫోకస్ చేయనున్నట్టు స్పష్టమవుతోంది.
అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ మొదలైంది. ఎందుకంటే లియో 2, GOAT 2, లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) వంటి భారీ ప్రాజెక్ట్స్ విజయ్‌కు సెట్ కావాలని అభిమానులు ఆశించారు. అంతేకాదు, అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కథను మొదట విజయ్‌కి వినిపించారని, రాజకీయాలపై ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో తిరస్కరించారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ఇక విజయ్ ఇటీవల చేసిన GOAT సినిమా రెమ్యునరేషన్ దాదాపు రూ.200 కోట్లు అంటున్నారు. జననాయకన్‌కి కూడా అంతే స్థాయిలో చెల్లిస్తున్నారట. ఈ లెక్కన విజయ్ వదులుకున్న నాలుగు నుంచి ఐదు భారీ సినిమాల ద్వారా ఆయన రూ.1000 కోట్లు దాటే రెమ్యునరేషన్ కోల్పోయినట్టేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం నటనకు వచ్చే పారితోషికం మాత్రమే. సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు, ఫేమ్ పెరుగుదల లెక్కలోకి తీసుకుంటే మరింత నష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ మాత్రం ఆయనకు ఇంకా బలమైన మార్కెట్ ఉందని నమ్ముతున్నారు. హిందీ, తెలుగు, కన్నడ మార్కెట్లలో కూడా విజయ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, రాజకీయాల కోసం సినిమాలు వదిలేయడం బాధగా ఉందంటున్నారు. అయినా రాజకీయాల్లో విజయ్ ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాల్సిందే.