Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఎప్పటికప్పుడు ఒకే మాట చెబుతుంటారు “మీరు ఎంత నిజాయతీగా పనిచేసినా, మీ వద్ద ఉన్న అధికారులు అవినీతికి పాల్పడితే ప్రభుత్వమే కలంకితమవుతుంది.” అని చెబుతారు. అయినా కొంతమంది మంత్రులు ఆయన మాటల్ని పెడచెవిన పెట్టినట్టు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని కీలక ఘటనలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.
తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించాల్సి వచ్చింది. అదే తరహాలో అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న రాజబాబు పేరుతో ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. గతంలోనే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా… మళ్లీ ఓఎస్డీగా నియమించుకోవడం ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.
గనుల శాఖపై పూర్తి పట్టున్న రాజబాబు పేరు రవీంద్ర పరిశీలించినప్పుడే అధికారులు హెచ్చరించినట్టు సమాచారం. అయినా ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఓకే చేయడం… ఇప్పుడు ఝలక్ ఇచ్చినట్టైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాజబాబు ట్రాక్ రికార్డు పరిశీలించి, అనుమానాల నేపథ్యంలో వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
ఇలాంటి ఉదంతాల వల్లే చంద్రబాబు మంత్రులకు పదే పదే సూచనలు చేస్తూ వచ్చారు.. సహాయకుల స్థానాల్లో అఫీషియల్స్ ను తరచూ మారుస్తూ ఉండాలని, వారి పైన నిఘా పెట్టాలని. కానీ కొన్ని విషయాల్లో అనవసరంగా మంత్రులు విశ్వాసం పెట్టడం, బాబు హెచ్చరికల్ని తక్కువగా తీసుకోవడం… ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్టను దెబ్బతీయనుంది. మరి బాబు చెప్పింది ఇకనైనా గుర్తు చేసుకుంటారా అనేది చూడాలి.