ప్రస్తుతం రాహుల్ గాంధీ అనర్హత వేటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మోడీ & కో చేసిన నియంతృత్వ పోకడల చర్యగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే క్రిమినల్ డిఫమేషన్ కేసుల్లో రాహుల్‌గాంధీ కంటే ముందు ఇలానే సస్పెండ్ అయ్యిన్ పదవులు కోల్పోయిన ప్రజాప్రతినిధుల లిస్ట్ చాలానే ఉంది. అయితే వారందరి విషయంలో నేరాలకు – రాహుల్ విషయంలో శిక్షకూ ఏమాత్రం పొంతనలేకపోవడం గమనార్హం. ఆ లిస్ట్ లో ఉన్న రాహుల్ సీనియర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణాల్లో… దాణా కుంభకోణం ఒకటి. అప్పట్లో ఈకేసు, ఆ కేసులో మెయిన్ రోల్ పోషించిన లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ఆల్ మోస్ట్ అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 2013లో ఈ కేసులో దోషిగా తేలడంతో లాలూ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన తర్వాత ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితపై 2014 సెప్టెంబర్ లో తమిళనాడు అసెంబ్లీ అనర్హత వేటు వేసింది.
2019 నాటి ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ కు కోర్టు 2022 అక్టోబర్ లో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వానికి ఆయన అనర్హులయ్యారు.
2012లో ప్రయాణాలు చేయకుండానే నకిలీ ఎయిర్ ఇండియా ఇ-టికెట్లను సృష్టించి ప్రయాణ భత్యం పొందేందుకు ప్రయత్నించిన కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని దోషిగా తేలాడు. దీంతో… 2022 అక్టోబర్ లో బీహార్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హులయ్యారు.
2013 నాటి ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ.. 2022 అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తన శాసనసభ్యత్వం కోల్పోయారు.
దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరికి జనవరి 2021లో హర్యానా అసెంబ్లీలో అనర్హత వేటుపడింది.
అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్ పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 2020 ఫిబ్రవరిలో అనర్హత వేటు వేసింది.
తన నివాసంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచి ఉంచిన కేసులో దోషిగా తేలడంతో ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై 2022 జూలైలో బీహార్ అసెంబ్లీ అనర్హత వేటువేసింది!
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… 1975లో ప్రధానిగా ఉండగానే ఇందిరాగాంధీ కూడా అనర్హతను ఎదుర్కొన్నారు. అవును… 1971లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఇందిరాగాంధీ… అనంతరం ప్రధాని పదవి చేపట్టారు. అయితే రాయ్ బరేలీలో జరిగిన ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డారని ఆమెచేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అలహాబాద్ హైకోర్టు ఈ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. అయితే… అనంతరం పైకోర్టుకు వెళ్లిన ఇందిరాగాంధీ… స్టే తెచ్చుకున్నారు!