వన నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లుల విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొదటగా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు వాటిని అజెండా నుంచి తొలగించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సోమవారం కేంద్రం బిజినెస్ లిస్టులో ఈ బిల్లులు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ పరిణామం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
అర్జున్ రామ్ మేఘ్వాల్ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లులను సోమవారం లోక్సభలో ప్రవేశపెడతారని అధికారికంగా ప్రకటించారు. దీనిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఎంపీలకు బిల్లుల కాపీలు పంపించడంతో పాటు చర్చ కోసం సిద్ధమవ్వాలని సూచనలు కూడా ఇచ్చారు. అయితే, అకస్మాత్తుగా బిల్లులను అజెండా నుంచి తొలగించడంపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.
డిసెంబర్ 20తో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ బిల్లులను ప్రస్తుత సెషన్లోనే చర్చకు తీసుకురావాలనే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ఈ జాప్యం వలన బిల్లుల అమలుపై సందిగ్ధత పెరిగింది. విపక్షాలు ఇప్పటికే ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామం ఈ చర్చలను మరింత వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్రం తన ఆలోచనలను ఇంకా సరిదిద్దుకుంటుందా? లేక ఈ సెషన్లోనే ప్రవేశపెట్టేందుకు కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏది ఏమైనా, ఒకే దేశం-ఒకే ఎన్నికల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారిన వేళ, ఈ పరిణామం మరింత చర్చకు దారితీయడం ఖాయం.