Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు ఎక్కడున్నారు?

Manchu Mohan Babu: మంచు కుటుంబంలో జరిగిన గొడవ విషయమై పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. విష్ణు, మనోజ్ ల స్టేట్‌మెంట్లు తీసుకున్న పోలీసులు, మోహన్ బాబును కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ఇప్పటివరకు మోహన్ బాబు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడం, గన్‌ను అప్పగించకపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. తాను ఆరోగ్యపరమైన కారణాలతో హాజరుకాలేకపోతున్నానని, త్వరలోనే విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.

ఫామ్‌హౌస్ వివాదంలో టీవీ రిపోర్టర్‌పై జరిగిన దాడి కేసు నేపథ్యంలో మోహన్ బాబుపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆయన ఎప్పుడైనా అరెస్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు తన లైసెన్స్ డ్ రివాల్వర్ అప్పగించినప్పటికీ, మోహన్ బాబు మాత్రం విచారణకు హాజరయ్యే సమయానికే అప్పగిస్తారని సమాచారం.

అయితే, మోహన్ బాబు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం కూడా హైకోర్టులో తిరస్కరణకు గురయ్యిందని ప్రచారం జరుగుతోంది. దీనితో ఆయన అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచు ఫ్యామిలీ గొడవలు, వాటి పరిణామాలు తెలుగు సినిమా పరిశ్రమలోనూ, సామాజిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. మోహన్ బాబు తదుపరి చర్యలు, పోలీసుల వివరణతో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.