ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబం ఇంకా గాఢ విషాదంలో ఉంది. ఆ ఘటనలో ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో వెంటిలేటర్‌పై ఉండగా, బాలుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ట్యూబుల ద్వారా ఆహారం అందజేస్తూ, చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఘటన అనంతరం, బాధిత కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభించింది. పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని అల్లు అర్జున్ ప్రకటించగా, ఈ చర్య బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది. అయితే, బాలుడి పరిస్థితి మెరుగుపడకపోవడం కుటుంబ సభ్యులను మరింత కుంగదీస్తోంది.
ఈ కేసులో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. థియేటర్ యజమాన్యం, మేనేజర్లు, ఇతర స్టాఫ్‌ను ఇప్పటికే అరెస్టు చేయగా, ఈ కేసులో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఘటనకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది. థియేటర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్న ఆరోపణలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో కుదుపు రేపింది. ఈ ప్రమాదం తర్వాత భద్రతా ఏర్పాట్లపై పునరాలోచన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద సినిమాల వేళ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ ప్రముఖులు, ప్రేక్షకులు గట్టిగా నొక్కి చెబుతున్నారు.