జమిలి ఎన్నికల గురించి ఎప్పటినుంచో రచ్చ జరుగుతూనే వుంది. ఇదిగో జమిలి.. అదిగో జమిలి.. అంటూ ఏళ్ళు గడిపేస్తున్నారు పాలకులు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎంత బావుంటుందో కదా.? కేంద్ర ఎన్నికల సంఘం మీద తాత్కాలికంగా ఒత్తిడి ఎక్కువ వుండొచ్చుగాక.. కానీ, దేశం మీద ఒత్తిడి తగ్గుతుంది.
ఆ రాష్ట్రంలో ఓ సారి అసెంబ్లీ ఎన్నికలు, ఈ రాష్ట్రంలో ఇంకోసారి అసెంబ్లీ ఎన్నికలు.. ఇవి కాక లోక్ సభ ఎన్నికలు ఇంకోసారి.! ఇలా ఇంకెన్నాళ్ళు.? ఎప్పుడూ ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతోంటే, అభివృద్ధి ఎలా.? చాలా ప్రశ్నలున్నాయ్.. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
అదిగదిగో.. ఈసారి జమిలి ఎన్నికలే జరుగుతాయ్.. అని కేంద్రం లీకులు ఇస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ టైమ్ ఎలక్షన్స్ అనే బిల్లు పెట్టబోతోందిట కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు. బిల్లు పెడితే సరిపోతుందా.. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర తగినంత సరంజామా వుందా.?
దేశం జమిలి ఎన్నికలకు సర్వసన్నద్ధమవ్వాలి. అదే పెద్ద టాస్క్.! త్వరలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. నిజానికి, ఇది రైట్ టైమ్. ఆ మాటకొస్తే, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ జమిలి చర్చ జరిగింది.
ఏమో, ఏం జరుగుతుందోగానీ.. జమిలి పట్ల ప్రజల్లో అయితే సానుకూల స్పందన కనిపిస్తోంది. న్యాయ సమీక్షలు వంటివి జరిగిపోయాయా.? రాజకీయ పార్టీలతో సంప్రదింపులూ పూర్తయ్యాయా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్స్. కానీ, జమిలి ఎన్నికలు జరగడమే మేలు.
మరి, ఉప ఎన్నికలు వస్తే ఏం చేస్తారబ్బా.? ఏమో, బిల్లు అంటూ పెడితే, అన్ని ప్రశ్నలకూ అందులో సమాధానం దొరకవచ్చు.