Lavanya Tripathi: పెళ్లి తర్వాత మొదటి సినిమాను అనౌన్స్ చేసిన లావణ్య త్రిపాఠి.. హీరో ఎవరో తెలుసా?

Lavanya Tripathi: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మనం, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం, ఉన్నది ఒకటే జిందగీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. చివరగా లావణ్య హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఏడేళ్ల పాటు ప్రేమించిన ప్రియుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా సతీ లీలావతి. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ సినిమా రూపొంద‌నుంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

 

ఇది ఇలా ఉంటే నేడు లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా టైటిల్ ని విడుదల చేశారు. స‌తీ లీలావ‌తి అనే చిత్రంతో మ‌రోసారి డిఫ‌రెంట్ రోల్‌, ఎగ్జ‌యిటింగ్ క‌థాంశంతో మెప్పించ‌టానికి లావ‌ణ్య త్రిపాఠి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా, బినేంద్ర మీన‌న్ సినిమాటో గ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఉద‌య్ పొట్టిపాడు మాట‌లు అందిస్తుండ‌గా.. కోసనం విఠ‌ల్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, స‌తీష్ సూర్య ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. కాగా సతీ లీలావతి సినిమా హీరో,ఇతర క్యాస్టింగ్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. హీరో తో పాటు ఇంకా ఈ సినిమాకు సంబంధించిన చాలా వివరాలను త్వరలో వెల్లడిస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.

Sathi Leelavathi - Title Reveal Video | Lavanya Tripathi Konidela | Tatineni Satya | Mickey J Meyer