రాష్ట్రస్థాయిలో టీఆరెస్స్ ని.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్.. బీఆరెస్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీజేపీయేతర పార్టీలతో జతకడుతూ.. బీజేపీ పతనాన్ని తపిస్తూ.. బీఆరెస్స్ ఎదుగుదలను కాంక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా… జాతీయస్థాయిలో తమ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని ప్రకటించారు కేసీఆర్. అయితే… ఇప్పుడు ఆ ఫస్ట్ టార్గెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయని తెలుస్తుంది!
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలపిస్తోన్న కేసీఆర్.. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి పెట్టారు. పక్క రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులను కారెక్కించడం మీద కాన్సంట్రేట్ చేశారు. తెలంగాణ బయట మహారాష్ట్రలో కేసీఆర్ ఇప్పటికే రెండు చేరికల సభలు నిర్వహించారు. ఫిబ్రవరి 5న నాందేడ్ లో, మార్చి26న కాందార్ లోహలో భారీ సభలు పెట్టారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే… కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ గా చెప్పుకున్న కర్నాటకలో మాత్రం ఎందుకో కారు ముందుకు కదలడం లేదని తెలుస్తుంది.
త్వరలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీలు ఎలక్షన్ క్యాంపైన్ స్టార్ట్ చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కానీ బీఆరెస్స్ లో మాత్రం కర్ణాటక ఎన్నికల చప్పుడు వినిపించడం లేదు. ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా.. కేసీఆర్ అక్కడ సభలు పెట్టడం లేదు. ఎవరిని చేర్చుకోవడం లేదు. దీంతో.. బీఆరెస్స్ ప్రస్థానానికి ఆదిలోనే హంసపాదా అన్న కామెంట్లు వెలుస్తున్నాయి.
దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తు కన్ఫార్మ్ అయిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ గతంలో సంకేతాలు ఇచ్చారు. జేడీఎస్ అధినేత కుమార స్వామి సైతం మొదట్లో కేసీఆర్ ప్రతిపాదనకు జై కొట్టారు. బీఆరెస్స్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఇంతలోనె ఏమైందో ఏమో కానీ… బీఆరెస్స్ ను కాస్త దూరం పెడుతున్నారు కుమారస్వామి! అయితే… కర్ణాటకలో బీఆరెస్స్ కు అసలు బలం లేదని స్పష్టమవడంతోనే.. అలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… అక్కడ గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది! దీంతో… బలం లేని బీఆరెస్స్ తో కంటే.. పుంజుకుంటున్న కాంగ్రెస్ తో కలిస్తేనే బెటరని కుమార స్వామి ఫిక్సయ్యారని అంటున్నారు.
దీంతో… కేసీఆర్ రూపాంతరం చెందించిన బీఆరెస్స్ కు ఫస్ట్ లోనే ఇలాంటి సమస్య వచ్చిందేమిటి? కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చి.. ఫ్యూచర్ పై బెంగ కలుగచేయాలని భావించిన బీఅరెస్స్ కు ఇలా జరిగిందేమిటని ఫీలవుతున్నారంట సగటు కేసీఆర్ అభిమాని! మరి మిగిలిన రాష్ట్రాల్లో అయినా కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకుంటారా? లేక, ఎలక్షన్ సమయంలో మాత్రమే మేల్కొని ఆశలు ఆవిరిచేసుకుంటారా అన్నది వేచి చూడాలి!