Kasturi Shankar: నేను ఎక్కడికి పారిపోలేదు.. షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చాను: కస్తూరి శంకర్

Kasturi Shankar: సినీ నటి కస్తూరి శంకర్ పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఈమె చెన్నై పుళల్‌ సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజులపాటు కోర్ట్ ఈమెకు రిమాండ్ ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈమె జైలుకు వెళ్లారు. హిందూ మక్కల్‌ కట్చి తరఫున జరిగిన ఆందోళనలో పాల్గొన్న నటి కస్తూరి ద్రవిడులు, తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

ఈ ఫిర్యాదుల మేరకు చెన్నై పోలీసులకు కేసు నమోదు చేసుకొని ఈమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కస్తూరి శంకర్ చెన్నైలో ఉంటున్న ఇంటికి తాళం వేయడమే కాకుండా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో ఈమె పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇలా పరారీలో ఉన్నటువంటి ఈమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా హైదరాబాద్ లో ఈమె పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు ఆమెను కోర్టుకు హాజరు పరచగా కోర్టు తనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

హైదరాబాద్‌లో సినీ నిర్మాత హరికృష్ణన్‌ బంగ్లాలో ఉన్న ఆమెను ప్రత్యేక బృందం పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఇక ఈమెను అరెస్టు చేయడానికంటే ముందుగానే ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదని వెల్లడించారు. నాకు ఎలాంటి భయం లేదు నేనెక్కడికి వెళ్లిపోలేదు హైదరాబాద్ కు కేవలం షూటింగ్ కోసం మాత్రమే వచ్చానని ఈమె తెలిపారు. ఇక ప్రతిరోజు హైదరాబాదులో షూటింగ్ పూర్తి చేసుకుని నా ఇంటికి వెళుతున్నానని ఈమె తెలియజేశారు.

ఇక నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడానికి కారణం లేకపోలేదు నా ఫోన్ ప్రస్తుతం న్యాయవాది వద్ద ఉందని, ఈ విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి శంకర్ విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. ఇకపోతే కస్తూరి శంకర్ తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత రావడంతో ఈమె బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ ఈమె అరెస్టు కాక తప్పలేదు. ఈనెల 29వ తేదీ వరకు ఈమెకు కోర్టు రిమాండ్ విధించింది.