దేశ రాజకీయాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజకీయాలలో ఒక శకం ముగిసింది.
డిఎంకె పెద్దాయన కరుణానిధి కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఉత్తరాది పెత్తనానికి, హిందీ పెత్తనానికి వ్యతిరేకంగా కరుణానిధి ఎంత సుదీర్ఘ పోరాటం చేశారో అనారోగ్యంతో కూడా అంతే తీవ్రంగా పోరాటం చేసి చివరకు ఈరోజు సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
కరుణానిధి తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. ఆయన సొంతపేరు దక్షిణా మూర్తి.
జులై 28వ తేదీన కరుణను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతకుముందు తీవ్ర జ్వరానికి, మూత్రనాళ ఇన్ఫెక్షన్ కు ఇంటివద్దనే చికిత్స జరిగింది. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
అయితే పది రోజుల పాటు కరుణానిధి మృత్యువుతో పోరాటం చేశారు. ఈ పదిరోజుల కాలంలోనే చాలాసార్లు ఆయన ఆరోగ్యం కుదటపడింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఆయన చిరునవ్వుతో స్పందించారు. అయితే కోట్లాది మంది అభిమానులను శోక సముద్రంలో ముంచి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కరుణానిధి దేశంలోనే అరుదైన రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కవి, స్క్రిప్ట్ రైటర్, ఉపన్యాసకుడు, గాయకుడు కూడా. ఆయనకు నలుగురు కుమారులు (స్టాలిన్, ఎంకె అలగిరి, ముత్తు, తమిళరసు), ఇద్దరు కుమార్తెలు (కనిమొళి, సెల్వి) ఉన్నారు.
1924 జూన్ 3వ తేదీన కరుణానిధి జన్మించారు. డిఎంకె అధ్యక్షుడిగా 50 ఏళ్లపాటు కొనసాగారు. ఒక రాజకీయ పార్టీకి ఇంతకాలం అధినేతగా కొనసాగడం భారత దేశంలో ఆయనొక్కడికే సాధ్యమైంది.
కరుణానిధి 1957లో తొలిసారిగా ఇండిపెండెంట్ సభ్యుడిగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఓటిమి ఎరుగని నేతగా గెలుస్తూ వచ్చారు. 82వ ఏట 2006లో ఆయన ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో పరాజయం అన్నది ఆయనకు తెలియదు.
ఆయన మృతితో తమిళనాడు తల్లడిల్లిపోతున్నది. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమాచారం విని తట్టుకోలేక సుమారు 27 మంది మరణించారు. ఇప్పుడు ఆయన మరణవార్త ను తమిళవాసులు ఎలా జీర్ణించుకుంటారో.
ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా తమిళ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. సెలవుల్లో ఉన్న పోలీసులను విధుల్లోకి పిలిపించారు. రేపు, ఎల్లుండి రెండురోజులపాటు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.